మన దేశంలో సొంతిల్లు మధ్య తరగతి ప్రజలకే కాదు డబ్బున్న శ్రీమంతులకు కూడా కలగానే మారిందని ఈ ఘటన నిరూపించింది. హాట్‌మెయిల్ సహ వ్యవస్థాపకుడు సబీర్ భాటియా బయటపెట్టిన ఒక విషయం మన దేశంలో రియల్ ఎస్టేట్ రంగం ఎంత అధ్వానంగా ఉందో, కస్టమర్లకు ఇంటిని అప్పగించే విషయంలో రియల్టర్లు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో చెప్పకనే చెప్పింది.
భారత దేశంలో తన కలల ఇంటిని బుక్ చేసుకుని పదేళ్లు గడిచిపోయిందని.. తనకు ఇప్పటికీ ఆ ఇల్లు పూర్తి చేసి తాళాలు తన చేతిలో పెట్టలేదని.. ఇప్పటికీ ఎదురుచూపులు తప్పడం లేదని సబీర్ భాటియా చెప్పారు. 2012లో బుక్ చేసుకున్న అత్యంత విలాసవంతమైన అపార్ట్‌మెంట్.. 2032లో అప్పగిస్తామని చెబుతున్నారని.. ఈ నిరీక్షణ మరో 20 ఏళ్లకు పెరిగిందని ఈ ఇండో అమెరికన్ బిజినెస్మెన్ చెప్పిన విషయం విస్మయానికి గురిచేసింది.
I booked an ultra luxury apartment in India in 2012. The project has gone through much drama. I’m told I’ll now get possession in 2032. Is the 20 year wait worth it?
— Sabeer Bhatia (@sabeer) July 28, 2026
సబీర్ భాటియా తన అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో ఈ విషయాన్ని పంచుకున్నారు. ఇండియాలో తన సొంతింటి కల ఇప్పటికీ కలగానే ఎలా మిగిలిపోయిందో చెబుతూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అయింది. మన దేశంలో గృహ నిర్మాణ ప్రాజెక్టులు పూర్తి చేసే విషయంలో రియల్ ఎస్టేట్ సంస్థల అలసత్వం, మన దేశ రియల్ ఎస్టేట్ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చకు భాటియా చేసిన పోస్ట్ కారణమైంది.
భాటియా మాత్రమే కాదు మన దేశంలో సొంతింటి కోసం లక్షలు, కోట్ల రూపాయలను EMIలుగా కడుతున్న ఎంతో మంది ఇలాంటి చేదు అనుభవాన్నే ఎదుర్కొంటున్నారు. కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలు చేస్తున్న తప్పు రియల్ ఎస్టేట్ రంగానికి శాపంగా మారింది. భారత రియల్ ఎస్టేట్ రంగాన్ని అపఖ్యాతి పాలు చేస్తుంది. ఒక ప్రాజెక్టును చూపించి అడ్వాన్స్‌గా డబ్బులు తీసుకొని, అది కంప్లీట్ చేయకుండానే.. ఆ నిధులను మరో ప్రాజెక్టుకు మళ్లిస్తున్నారు.
బ్యాంకుల్లో లోన్లు తీసుకొని అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్లు, విల్లాలు కొనుగోలు చేసినోళ్లేమో.. అవి తమ చేతికి అందక, సొంతింటి కల నెరవేరక ఆవేదన చెందుతున్నారు. మరోవైపు ఈఎంఐల భారంతో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. త్వరగా ప్రాజెక్టులు పూర్తి చేయాలని నెలలు, సంవత్సరాల తరబడి రియల్టర్లు, బిల్డర్లు చుట్టూ తిరిగి అలసిపోతున్నారు.
గ్రేటర్ హైదరాబాద్‌సిటీ చుట్టూ రియల్టర్లు, బిల్డర్లు, ఏజెంట్లు మోసాలకు పాల్పడుతున్నారు. ప్రీ లాంచ్‌ల పేరుతో కొనుగోలుదారులను మాయ చేస్తున్నారు. అగ్రిమెంట్ల ప్రకారం అపార్ట్‌మెంట్లు, విల్లాల నిర్మాణాలు పూర్తి చేయడం లేదు. గడువులోగా ఫ్లాట్లను, ప్లాట్లను అప్పగించడం లేదు. చెప్పిన సౌలతుల (ఎమినిటీస్)ను కల్పించడం లేదు. ముందు చెప్పేదొకటి.. ఆ తర్వాత చేసేదొకటి అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. భాటియా పోస్ట్తో మరోసారి ఈ తరహా రియల్ ఎస్టేట్ మోసాలు హాట్ టాపిక్ కావడం గమనార్హం.
