శివమొగ్గ: కర్నాటకలో విషాద ఘటన జరిగింది. హోలెహొన్నూరు సమీపంలో ఓ నవవధువు వాట్సాప్‌లో డెత్ నోట్ రాసి భద్ర కాలువలో దూకి ఆత్మహత్య చేసుకుంది. భద్రావతి తాలూకాలోని డి.బి. హళ్లికి చెందిన లత (25) ఆత్మహత్య చేసుకుంది. ఆమె 2025, ఏప్రిల్ 14న శికారిపురలోని దిండాదహళ్లి గ్రామానికి చెందిన గురురాజ్‌ను వివాహం చేసుకుంది. గురురాజ్ కెపిసిఎల్‌లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఎఇఇ)గా పనిచేస్తున్నాడు. పెళ్లైన కొన్నాళ్లకే లతను ఆమె భర్త, అతని కుటుంబం అదనపు కట్నం కోసం వేధించేదని డెత్ నోట్‌లో ఆమె రాసింది.
లత కుటుంబం ఫిర్యాదుతో.. ఆమె భర్త గురురాజ్, అత్త శారదమ్మ, నాదిని నాగరత్నమ్మ, రాజేశ్వరి, నాగరత్నమ్మ భర్త కృష్ణప్పతో సహా ఐదుగురిపై హోలెహొన్నూర్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. పెళ్లి సమయంలో, అల్లుడు గురురాజ్, అతని కుటుంబం అడిగినంత డబ్బు, బంగారం ముట్టజెప్పామని.. అయినా తమ కూతురిని డబ్బు, బంగారం కోసం వేధించి పొట్టనబెట్టుకున్నారని లత కుటుంబం కన్నీరుమున్నీరైంది. లత కుటుంబం.. రూ. 10 లక్షల డబ్బులు, కోరినంత బంగారం కట్నంగా ఇచ్చింది. 20 లక్షలు ఖర్చు చేసి పెళ్లి ఘనంగా జరిపించారు. అయినా సరే.. లత భర్త గురురాజ్.. అతని కుటుంబ ధన దాహం తీరలేదు.
లత తన బంధువులకు వాట్సాప్ ద్వారా పంపిన డెత్ నోట్ లో ఎవరూ చెడ్డవాళ్ళుగా పుట్టరు అని ఉంది. ప్రతి అమ్మాయి పెళ్లి తర్వాత వైవాహిక జీవితంపై కోటి ఆశలతో అత్తారింట్లో అడుగుపెడుతుంది. కొత్త ఇంట్లో అడుగుపెట్టాక అడ్జస్ట్ అవడానికి కొంత సమయం పడుతుంది. ఈలోపే.. భర్త, అత్తమామలు ఆమెను ద్వేషిస్తే.. ఆ అమ్మాయి బతికి ఉన్నా చచ్చినట్లే అని డెత్ నోట్లో లత రాసింది. తన భర్త గురురాజ్, ఆ ఐదుగురు తన చావుకు బాధ్యులని, వారిని శిక్షించాలని లత కోరింది.
