అప్పట్లో రౌడీ.. ఇప్పుడు పూజారి..21 కేసులు.. 14 ఏండ్లుగా పరారీ

అప్పట్లో రౌడీ.. ఇప్పుడు పూజారి..21 కేసులు.. 14 ఏండ్లుగా పరారీ
  • గ్యాస్ కనెక్షన్​తో చిక్కిన మోస్ట్ వాంటెడ్ రౌడీ షీటర్

సుల్తాన్ బజార్, వెలుగు: గత14 ఏండ్లుగా తప్పించుకొని తిరుగుతున్న మోస్ట్ వాంటెడ్ రౌడీ షీటర్ విష్ణవ్ కిషన్ దాస్ అలియాస్ వైష్ణవ్ గణేశ్ మహరాజ్ చివరకు సుల్తాన్ బజార్ పోలీసులకు చిక్కాడు. ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి వివరాల ప్రకారం.. యూపీకి చెందిన విష్ణవ్ కిషన్ దాస్​పై 1999 నుంచి సుల్తాన్ బజార్ పీఎస్​లో రౌడీ షీట్ నమోదై ఉంది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లతో పాటు ఇతర జిల్లాల్లో అతడిపై మొత్తం 21 కేసులు ఉన్నాయి.

2010లో ఓ హత్య కేసులో అరెస్టయిన విష్ణవ్.. రెండేండ్ల జైలు జీవితం తర్వాత 2012 మేలో బెయిల్​పై విడుదలయ్యాడు. అప్పటి నుంచి కోర్టు విచారణలకు హాజరుకాకుండా పరారీలో ఉన్నాడు. విష్ణవ్ తన గుర్తింపును పూర్తిగా మార్చుకున్నాడు. ఆధార్ కార్డులో తన పేరును ‘విష్ణవ్ కిషన్ దాస్’ నుంచి ‘వైష్ణవ్ గణేశ్ మహరాజ్’గా మార్చుకున్నాడు. మలక్​పేటలో ఉంటూ ఎవరికీ అనుమానం రాకుండా పురోహిత్యం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.

నిందితుడి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు నిరంతరం నిఘా పెట్టాయి. అతను వాడుతున్న పాత మొబైల్ నంబర్ ఆధారంగా కీలక ఆధారాలను సేకరించారు. ఆ మొబైల్ నంబర్​తో ఒక గ్యాస్ కనెక్షన్ ఉన్నట్లు గుర్తించారు. నిందితుడు జాగ్రత్తపడి నంబర్​ను మార్చాడు. గ్యాస్ కనెక్షన్ రికార్డుల్లో అప్​డేట్ చేసిన కొత్త నంబర్.. ‘వైష్ణవ్ గణేశ్​ మహరాజ్’ అనే పేరును పోలీసులు గమనించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు గ్యాస్ కనెక్షన్ అడ్రస్​ను ఛేదించి మలక్​పేటలో నివాసం ఉంటున్న విష్ణవ్​ను ఈనెల 27న అరెస్ట్ చేశారు.