- వనం నుంచి జనంలోకి తల్లి సమ్మక్క
భద్రాచలం,వెలుగు : ఆదివాసీలు ఆరాధ్య దేవతలుగా కొలిచే దుమ్ముగూడెం మండలం మారాయిగూడెం సమ్మక్క సారలమ్మ (మినీ మేడారం) అడవి తల్లుల జాతరకు భక్తులు పోటెత్తారు. మూడవరోజు గురువారం నిండు జాతర కావడంతో భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చి అమ్మవార్ల గద్దెలను దర్శించుకోవడంతోపాటు బెల్లం, మొక్కులు సమర్పించుకున్నారు. నిండు జాతర సందర్భంగా మధ్యాహ్నం 12 గంటలకు సమీప గుట్టల నుంచి వనదేవత మేళ తాళాలు మంగళ వాయిద్యాలతో గుడికి చేరుకోగా, సాయంత్రం నాలుగు గంటలకు సమ్మక్క గుట్ట నుంచి మేళ తాళాలు , మంగళ వాయిద్యాలు, కోయ డ్యాన్సులు డప్పుల మధ్య ఇలవేల్పులతో వేడుకగా గద్దె పైకి చేరుకున్నారు.
సమ్మక్క సారలమ్మ గద్దెకు చేరుకోవడంతో భక్తులు వేలాదిగా తరలివచ్చి అమ్మవార్ల గద్దెలను దర్శించుకున్నారు. దేవరబాలలు సోడి అచ్చమ్మ, శాంతమ్మలు భక్తులకు ప్రత్యేక ఆశీర్వచనాలు అందజేశారు. నిండు జాతర సందర్భంగా భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఐటీడీఏ పీవో బి రాహుల్ అమ్మవార్ల గద్దెను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీతోపాటు, వాలంటీర్లు ప్రత్యేక ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఎమ్మెల్యే వెంట భద్రాచలం మార్కెట్ కమిటీ చైర్మన్ తెల్లం సీతమ్మ, మాజీ జెడ్పిటిసి అన్నే సత్యనారాయణమూర్తి , కాంగ్రెస్ పార్టీ మాజీ మండలాధ్యక్షులు లంక శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు తెల్లం హరికృష్ణ తదితరులు ఉన్నారు.
