కళ్యాణ లక్ష్మి అప్లికేషన్ కోసం.. లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిన జీపీవో

కళ్యాణ లక్ష్మి అప్లికేషన్ కోసం.. లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిన జీపీవో

వికారాబాద్ జిల్లాలో అవినీతి అధికారులపై ఏసీబీ అధికారులు మరోసారి పంజా విసిరారు. దోమ మండల తహశీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీలలో లంచావతారం ఎత్తిన  రెవెన్యూ అధికారి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.

వివరాల్లోకి వెళితే.. దోమ మండలం మోత్కూర్ రెవెన్యూ పరిధిలో కళ్యాణ లక్ష్మి పథకం కింద దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుడి అప్లికేషన్‌ను అప్రూవల్ చేయడానికి మోత్కూర్ రెవెన్యూ జీపీవో (GPO) రూ.6 వేలు లంచం డిమాండ్ చేశాడు. లంచం ఇవ్వడం ఇష్టం లేని బాధితులు నేరుగా ఏసీబీ అధికారులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.

ALSO READ : 3 రోజుల క్రితం సీఎం చంద్రబాబుతో మాట ముచ్చట..

బాధితుల ఫిర్యాదు మేరకు పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు, తహశీల్దార్ కార్యాలయంలో బాధితుల నుండి రూ.6 వేలు లంచం తీసుకుంటుండగా జీపీవోను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అవినీతికి పాల్పడిన అధికారిని అదుపులోకి తీసుకుని, రికార్డులను పరిశీలిస్తున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు లంచాలు డిమాండ్ చేస్తే ఎంతటివారైనా కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు.