కొడిమ్యాల, వెలుగు : జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. గంగారం తండా గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున ఓ ఆవును చంపిన పులి.. సోమవారం తెల్లవారుజామున మరో సూడి ఆవును చంపేసింది. గ్రామానికి కూతవేటు దూరంలోనే పులి సంచరిస్తున్నట్లు తెలియడంతో గ్రామస్తులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
విషయం తెలుసుకున్న డీఎఫ్‌ఓ రవిప్రసాద్ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. పులిని ట్రాక్ చేసేందుకు బెంగళూరుకు చెందిన ప్రత్యేక బృందం నిజామాబాద్‌కు చేరుకున్నట్లు ఆఫీసర్లు వెల్లడించారు. పులి సంచారాన్ని తెలుసుకునేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పులి తిరుగుతుందన్న భయంతో రైతులెవరూ పొలాల వైపు వెళ్లడం లేదు. మృతి చెందిన రెండు ఆవుల యజమానులకు తక్షణ సాయంగా రూ. 5 వేలు అందజేశారు. కాగా, కొడిమ్యాల మండలంలో తిరుగుతున్నది మగ పులి కావచ్చని, వయసు సుమారు నాలుగేండ్లు ఉండొచ్చని ఎఫ్‌ఆర్‌వో మొయినొద్దీన్ అభిప్రాయపడ్డారు.
