కేసీఆర్ స్కామ్​లపై ఉద్యమాలు

కేసీఆర్ స్కామ్​లపై ఉద్యమాలు
  • బొగ్గు గనుల వేలంలో రూ.50 వేల కోట్ల స్కామ్​కు ప్లాన్​: పీసీసీ చీఫ్ రేవంత్

హైదరాబాద్, వెలుగు: కేసీఆర్ కుటుంబం చేస్తున్న అవినీతి, అక్రమాలు, దోపిడీపై ప్రజాక్షేత్రంలో ఉద్యమాలు బలోపేతం చేయ్యాలని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ‘‘కోర్టులలో కేసుల పరిశీలనలో జాప్యం, ప్రభుత్వం తరఫున కావాలని కేసులను నీరు గార్చే ప్రయత్నాలు జరుగుతున్నయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా ద్వారా కేసీఆర్ కుటుంబ అవినీతిని ప్రజల్లో ఎండగట్టాలి” అని అన్నారు. గురువారం జూమ్​లో జరిగిన పీసీసీ కార్యవర్గ సమావేశంలో రేవంత్ మాట్లాడారు. జాతీయ రాజకీయాలు అంటూ కేసీఆర్ దేశంలో కాంగ్రెస్​ను దెబ్బతీసేలా బీజేపీతో లోపాయికారి అవగాహనతో యూపీఏ భాగస్వామ్య పక్షాలతో మీటింగ్​లు పెడుతున్న విషయంపై ప్రజలను చైతన్యవంతులను చేయాలన్నారు. నైని బొగ్గు గని విషయంలో బీజేపీ, టీఆర్ ఎస్ కుమ్మక్కై రూ.50 వేల కోట్లు దోచుకోవడానికి వేస్తున్న ఎత్తుగడలపై సింగరేణి కార్మిక సంఘాలతో కలిసి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.
డిజిటల్​మెంబర్​షిప్ సక్సెస్
డిజిటల్ మెంబర్ షిప్ తెలంగాణలో అందరి సహకారంతో సక్సెస్ చేయగలిగామని రేవంత్ అన్నారు. పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికి ఏప్రిల్ 1 నుంచి ప్రమాద బీమా వర్తించేలా స్కీమ్​ను ప్రారంభిస్తున్నామని, సభ్యత్వ రుసుము, బీమా రుసుము చెల్లించేలా చర్యలు తీసుకోవాలని నేతలకు సూచించారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్లతో సమావేశం ఏర్పాటు చేసి వారి సలహాలు, సూచనలు తీసుకోవాలన్నారు. పీసీసీ శిక్షణా విభాగం, మాజీ సైనికోద్యోగుల విభాగం, లింగ్విస్టిక్ మైనారిటీ విభాగాలకు చైర్మన్లను నియమిస్తామని తెలిపారు. మీటింగ్ లో బోసు రాజు, శ్రీనివాస్ కృష్ణన్, మధు యాష్కీ, మహేశ్వర్ రెడ్డి, మహేశ్ కుమార్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్, అజారుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.