
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాటలు చూస్తుంటే జాలిగా ఉందని, పవర్ పోగానే ఆయన మతి తప్పి మాట్లాడుతున్నడని ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలే ఫిరాయింపులు స్టార్ట్ చేశాయని.. ఇపుడు ఆ పార్టీల నేతలు రాజ్యాంగం, నైతిక విలువల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని మంగళవారం ఒక ప్రకటనలో ఆయన విమర్శించారు.
రాష్ట్రంలో 2014, 2018లో బీఆర్ఎస్ ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకున్నదని, బీజేపీ కూడా ఇతర రాష్ట్రాల్లో ఈడీ, సీబీఐ దాడులు చేయించి వేరే పార్టీల వారిని లాక్కున్నదన్నారు. ఇప్పుడు ఆరు గ్యారంటీలు, ప్రజా పాలన హామీల అమలు చూసి ఇతర పార్టీల ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతున్నారని తెలిపారు. తెలంగాణ ఇచ్చిన దేవత సోనియా గాంధీ అని అసెంబ్లీలో కేసీఆర్ ఎన్నో సార్లు చెప్పారని, తెలంగాణ ఇచ్చినపుడు కృతజ్ఞతగా కేసీఆర్ కుటుంబం అంతా వెళ్లి సోనియా కాళ్ల మీద పడలేదా? అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ లో టీఆర్ఎస్ ను విలీనం చేస్తా అని చెప్పి మాట తప్పారన్నారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించడం కోసం వారి మీద డమ్మీ అభ్యర్థులను నిలబెట్టి కేసీఆర్ సహకరించారని ఆరోపించారు.