- బెంగాల్ కంటే తెలంగాణలో గెలవడం ఈజీ: ఎంపీ అర్వింద్
- పార్టీలో అభిప్రాయ భేదాలు సహజమే
- బీఆర్‌ఎస్‌ను ఖతం చేస్తామని కామెంట్
యాదాద్రి, వెలుగు: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ తెలిపారు.‘‘2029 ఎన్నికల్లో రాజకీయం చేస్తం. పశ్చిమ బెంగాల్‌లో చేసింది చేస్తం. ఢిల్లీలో చేసేదీ ఢిల్లీలో చేస్తం. ఆకాశం కింద ఏమేం చేయాలో అన్నీ చేస్తం. లీగల్‌గా కిందామీద చేసైనా తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తం” అని వ్యాఖ్యానించారు. యాదాద్రి జిల్లా వడాయిగూడెంలో జరుగుతున్న ‘బీజేపీ ప్రశిక్షణ మహా అభియాన్ 2026’ ముగింపు సమావేశంలో అర్వింద్ పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారం రావడం కోసం బీజేపీ శ్రేణులు ఏం చేయాలో వివరించారు.
ముందుగా విలేకరులతో ఆయన మాట్లాడారు. 12 ఏండ్లలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించారు. పశ్చిమ బెంగాల్‌లో కంటే తెలంగాణలో గెలవడం ఈజీ అని అన్నారు. ఇప్పటివరకూ మోడీ చరిష్మాను ఉపయోగించుకోవడంలో బీజేపీ విఫలమైందని తెలిపారు. ఈసారి బీఆర్‌ఎస్ సహా ఏ పార్టీతో అవగాహన లేకుండా అధికారంలోకి వస్తామని స్పష్టం చేశారు. ఆ ఎన్నికల్లో రేవంత్ ఘోరంగా ఓడిపోతారని అన్నారు. కాంగ్రెస్‌లో ఉత్తమ్, కోమటిరెడ్డి, బీఆర్‌ఎస్‌లో కేటీఆర్, హరీశ్, కేసీఆర్ మధ్య ఉన్నట్టే బీజేపీలోనూ అభిప్రాయ భేదాలున్నాయని తెలిపారు. బీజేపీ అధ్యక్ష పదవి విషయంలో తాను ఆశిస్తున్నట్టు రాసుకోవచ్చని చెప్పారు.
బుద్ధిపుట్టినోళ్లు పార్టీ పెడ్తున్నరు..
రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ను ఖతం చేస్తామని అర్వింద్ తెలిపారు. ఎవరికి బుద్ధి పుడితే వారు పార్టీ పెడుతున్నారని కవితను ఉద్దేశించి కామెంట్ చేశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇస్తానని ఎవరికీ ఇవ్వలేదని మండిపడ్డారు. అయితే కేటీఆర్, కవితకు చెరో రెండు ఫామ్ హౌస్‌లు కట్టించి ఇవ్వడంతో పాటు తాను కూడా ఫామ్ హౌస్ నిర్మించుకున్నాడని కేసీఆర్‌నుద్దేశించి అన్నారు. కాంగ్రెస్ సర్కారు కూడా నియోజకవర్గానికి3 వేల ఇండ్లు ఇస్తానని చెప్పి ఇవ్వడం లేదన్నారు. వడ్ల కొనుగోలుపై రేవంత్ సర్కారు అన్ని అబద్ధాలే చెబుతోందని ఆరోపించారు.
గడిచిన సీజన్లకు చెందిన 32 లక్షల టన్నులనే ఇప్పటివరకూ ఎఫ్‌సీఐకి రాష్ట్ర ప్రభుత్వం అప్పగించలేదని తెలిపారు. ‘‘రెడ్డి బ్రదర్స్‌కు డబ్బులు మింగడంలో ఉన్న శ్రద్ధ.. వడ్ల కొనగోలుపై లేదు”అని సీఎం రేవంత్ సోదరుల పేర్లను ప్రస్తావించారు. వైఎస్సార్ 2 పేరుతో రేవంత్.. కేవీపీ పేరుతో వేం నరేందర్‌రెడ్డి చలామణి అవుతున్నారని ఎద్దేవా చేశారు. వైఎస్ గోచీకున్న విలువ రేవంత్‌కు లేదని అన్నారు. మీనాక్షి నటరాజన్‌పై కోర్టులో కేసు ఉన్న విషయం కుట్రపూరితంగా రేవంత్ లీక్ చేశారా? మరెవరన్న లీక్ చేశారా? అనేది కాంగ్రెస్ తేల్చుకోవాలని తెలిపారు.
