శనివారం వినాయక చవితి పర్వదినం సందర్భంగా.. కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రజలందరికి గణేష్ చతుర్థి శుభాకాంక్షలు తెలుపుతూ.. సామాజికంగా ప్రజలంతా ఎదుర్కొంటున్న అన్ని విఘ్నాలు తొలగిపోవాలని ఆ గణపతిని ప్రార్థిస్తున్నానని తెలిపారు.
ప్రకటనలో… “సమాజ ఏకత ధ్యేయంగా జరుపుకునే గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా యావత్ తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఉత్తేజకరమైన సమాజాన్ని నిర్మించేందుకు, భారతీయ సమాజం ఏకతాటిపై నిలిచేందుకు లోకమాన్య బాలగంగాధర్ తిలక్ ప్రారంభించిన ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాలను సాంప్రదాయబద్ధంగా ప్రతియేటా ఘనంగా నిర్వహించుకుంటున్నాము. గణేష్ ఉత్సవాలు భారతీయ సమాజంలో ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబానికి అంతర్లీనంగా సామాజిక బంధంగా పెనవేసుకొని ఉంది. ముఖ్యంగా తెలంగాణ ప్రజానీకంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల పాత్ర చాలా కీలకంగా మారింది.
స్వాతంత్రోద్యమంలో దేశవ్యాప్తంగా గా సంఘటనాత్మక భావాన్ని పెంపొందించిన ఈ ఉత్సవాలు, తెలంగాణ సమాజంలో నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో సైతం కీలక పాత్రను పోషించాయి. గణేష్ ఉత్సవాల ప్రారంభం నుండి దసరా వరకు మూడు సార్లు నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగడం ఈ పండగల వెనక ఉన్న సామాజిక నేపథ్యాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. వ్యక్తిగత బంధాలను సామాజిక బంధాలు గా మార్చడంలో గణేష్, బొడ్డెమ్మ, దేవి నవరాత్రి ఉత్సవాలు ప్రముఖ పాత్ర వహించడం మన పరంపరకు ఉన్న గొప్పతనం. ఈ పరంపరను కొనసాగించడంలోనే భారతీయత హిందుత్వం నిలబడుతుంది. ప్రగాఢ విశ్వాసంతో మనం కొలిచి ఆచరించే ఈ గణపతి ఉత్సవాలతో మనం సామాజికంగా ఎదుర్కొంటున్న అన్ని విఘ్నాలు తొలగిపోవాలని ఆ గణపతిని ప్రార్థిస్తున్నాను. విలయ తాండవం చేస్తున్న కరోనా మహమ్మారి కూడా తొలగిపోవాలని కోరుకుందాం” అని బండి సంజయ్ తెలిపారు.

