ప్రతి గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది: ఎంపీ చామల కిరణ్

ప్రతి గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది: ఎంపీ చామల కిరణ్

కట్టంగూర్ (నకిరేకల్), వెలుగు:  రైతులు పండించిన ప్రతి గింజనూ  ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని భువనగిరి పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్ వేముల వీరేశం తెలిపారు. ఆదివారం నల్గొండ జిల్లా కట్టంగూర్ మండలం అయిటిపాముల గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వారు సందర్శించారు. 

ధాన్యం సేకరణ, తూకం, రవాణా ఏర్పాట్లను పరిశీలించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంట అమ్మిన 48 గంటల్లోనే నగదు రైతుల ఖాతాల్లో జమ అయ్యేలా పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో తాగునీరు, నీడ, టార్పాలిన్లు లాంటి కనీస వసతులు ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. దళారుల ప్రమేయం లేకుండా పారదర్శకంగా కొనుగోళ్లు జరపాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలని సూచించారు.