స్పీకర్.. ​ప్రతిపక్షాల గొంతు నొక్కుతుండ్రు... గడ్డం వంశీకృష్ణ

స్పీకర్.. ​ప్రతిపక్షాల గొంతు నొక్కుతుండ్రు... గడ్డం వంశీకృష్ణ
  • ఆయన నియంతృత్వంగా వ్యవహరిస్తున్నరు
  • నీట్​విద్యార్థులకు న్యాయం చేసేదాకా కొట్లాడ్తం

ఢిల్లీ: లోక్​సభ స్పీకర్ ఓం బిర్లా నియంతృత్వంగా వ్యవహరిస్తున్నారని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఆరోపించారు. మాజీ ప్రధాని పీవీ జయంతి సందర్భంగా ఢిల్లీలోని తెలంగాణ భవన్​లో కాంగ్రెస్ ఎంపీలు మల్లురవి, గడ్డం వంశీకృష్ణ, జైవీర్ రెడ్డి, చామల కిరణ్ రెడ్డి పీవీ చిత్రపటానికి నివాళి అర్పించారు. వంశీకృష్ణ మాట్లాడుతూ పీవీ నరసింహారావు క్యాబినెట్ లో కాకా మంత్రిగా దేశాభివృద్ధిలో భాగం అయ్యారని గుర్తుచేశారు. ఆరోజుల్లో ప్రతిపక్షాలు మాట్లాడేందుకు అవకాశం ఇచ్చేవారని.. కానీ ప్రస్తుతం లోక్​సభ స్పీకర్ ఓం బిర్లా  బీజేపీ స్పీకర్ అన్నట్లు ప్రవర్తిస్తున్నారని అన్నారు.

నీట్ పేపర్ లీకేజీపై చర్చ చేపట్టాలని, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని వెల్ లో ఆందోళనలు చేశామని తెలిపారు. విద్యార్థులకు న్యాయం చేసేంతవరకు వారి గొంతుగా పార్లమెంట్ లో కొట్లాడుతామని తెలిపారు. నాగర్​కర్నూల్​ఎంపీ మల్లురవి మాట్లాడుతూ అత్యంత క్లిష్ట సమయంలో ఉన్న దశలో దేశానికి ఒక దిశను చూపించిన వ్యక్తి పీవీ నరసింహారావు అని కొనియాడారు. ఆయనతో పనిచేసే అవకాశం తనకు దక్కడం అదృష్టంగా భావించానని తెలిపారు. చామల కిరణ్ రెడ్డి మాట్లాడుతూ మోదీ గత 10 ఏళ్లుగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ పాలన కొనసాగిస్తున్నారు. నీట్ అంశంపై చర్చ జరగకుండా సభను వాయిదా వేశారని మండిపడ్డారు.