వెన్నుపోటు పొడిచిన వారిని ఎప్ప‌టికీ విడిచి పెట్ట‌ను

వెన్నుపోటు పొడిచిన వారిని ఎప్ప‌టికీ విడిచి పెట్ట‌ను
  • న‌కిరేక‌ల్‌ రాజ‌కీయాల‌ను చూస్తుంటే ర‌క్తం మ‌సులుతుంది
  • మేం త‌లుచుకుంటే ఎమ్మెల్యే, మంత్రి ప‌ల్లీబ‌టానీలు అమ్ముకోవాల్సి వ‌స్తుంది
  • కాంగ్రెస్ పార్టీ బీ ఫామ్ ఇచ్చిన అభ్యర్థులను డబ్బుతో కొంటున్నారు
  • కాంగ్రెస్ నేత‌ల జోలికి వ‌స్తే బొంద తీసి పాతిపెడుతా
  • కాంగ్రెస్‌కు లింగ‌య్య న‌మ్మ‌క‌ద్రోహం చేశారు
  • న‌కిరేక‌ల్ మున్సిప‌ల్ ఎన్నిక‌ల ప్రచారం ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి


కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల‌పై బెదిరింపు రాజకీయాల‌కు పాల్ప‌డితే ఖ‌బ‌ర్ధార్ అని భువ‌న‌గిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి టీఆర్ఎస్ నేత‌ల‌ను తీవ్ర స్థాయిలో హెచ్చ‌రించారు. న‌కిరేక‌ల్‌లో జ‌రుగుతున్న రాజ‌కీయాల‌ను చూస్తుంటే ర‌క్తం మ‌సులుతుందని.. వెన్నుపోటు పొడిచిన వారిని ఎప్ప‌టికీ విడిచి పెట్ట‌నని ఆయన స్ప‌ష్టం చేశారు. న‌కిరేక‌ల్ ప‌ట్ట‌ణ మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో భాగంగా ఆయన కాంగ్రెస్ అభ్య‌ర్థుల త‌ర‌పున మంగళవారం  ప్ర‌చారం నిర్వ‌హించారు. 

ఈ సంద‌ర్భంగా కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి మాట్లాడుతూ... ‘న‌కిరేక‌ల్ ప్ర‌జ‌లు న‌మ్మకం పెట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిపించిన లింగ‌య్య.. అమ్మ పాలు తాగి రొమ్ము గుద్దిన విధంగా ప్ర‌వ‌ర్తించారు. అమ్మ‌కు రైక పెట్టనోడు.. పిన్న‌మ్మ‌కు కోకా పెడుతా అన్న‌ట్లు ఏడేళ్లుగా సూర్యాపేట‌కు తాగునీరు ఇవ్వ‌ని మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి.. న‌కిరేక‌ల్‌ అభివృద్ది చేస్తాన‌ని చెప్ప‌టం విడ్డూరంగా ఉంది. న‌కిరేక‌ల్‌లో టీఆర్ఎస్ పార్టీ నాయకులు.. కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల‌పై బెదిరింపు రాజకీయాల‌కు పాల్ప‌డుతున్నారు. మేం త‌లుచుకుంటే న‌కిరేక‌ల్ ఎమ్మెల్యే చిరుమ‌ర్తి లింగ‌య్య‌, ఉమ్మడి న‌ల్గొండ జిల్లా మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి ఇద్దరూ ప‌ల్లీ, బ‌టానీలు అమ్ముకోవాల్సి వ‌స్తుంది.  మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో ఓడిపోతామ‌నే భ‌యంతో.. కాంగ్రెస్ పార్టీ బీ ఫామ్ ఇచ్చిన నలుగురు అభ్య‌ర్థుల‌ను డ‌బ్బుతో కొని.. టీఆర్ఎస్ లీడర్లు ప్ర‌జాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. నేను మార్కెట్ యార్డులో ధ‌ర్నా చేస్తే స‌ర్కార్ దిగొచ్చి మ‌ద్ద‌తు ధ‌రకు ధాన్యం కొంటుంది. బ్ర‌ాహ్మణ వెల్లంల ప్రాజెక్టు మిగిలిన ప‌నుల‌కు వంద కోట్లు ఖ‌ర్చు చేస్తే న‌కిరేక‌ల్ నియోజ‌కవ‌ర్గానికి సాగునీరు అందేది. ప‌నిమంతుడు పందిరేస్తే.. కుక్క తోక త‌గిలి ప‌డిపోయింద‌న్న‌ట్లు.. ఎన్నో వ‌ర‌ద‌ల‌ను త‌ట్టుకున్న మూసీ న‌ది గేట్లు.. టీఆర్ఎస్ చేసిన మ‌ర‌మ్మ‌త్తుల వ‌ల్ల మ‌రుస‌టి రోజే కొట్టుకుపోయాయి. ప్రత్యేక తెలంగాణ కోసం ఆనాడు 1200 మంది యువ‌త ప్రాణాలు తీసుకుంటే.. ఇప్పుడు ఉద్యోగాలు రాక యువ‌త ప్రాణాలు తీసుకుంటున్నారు. సునీల్ నాయ‌క్ చ‌నిపోతూ రాష్ట్రంలోని  ప్ర‌తి ఒక్క యువ‌తకు ఉద్యోగం వ‌చ్చే విధంగా చూడాలని మ‌న‌పై బాధ్య‌త పెట్టి పోయాడు. సునీల్ నాయ‌క్ కోరిక తీర్చేందుకు ప్ర‌తి ఒక్క‌రూ కృషి చేయాలి. న‌కిరేక‌ల్ మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అభ్య‌ర్థుల‌ను అఖండ మెజారిటీతో గెలిపించండి. కాంగ్రెస్ నేత‌ల జోలికి వ‌స్తే బొంద తీసి పాతిపెడుతా. వెన్నుపోటు పొడిచిన వారిని ఎప్ప‌టికీ విడిచిపెట్ట‌ను. రాజ‌కీయ జీవితం ఇచ్చిన కాంగ్రెస్‌కు లింగ‌య్య న‌మ్మ‌క‌ద్రోహం చేశారు’ అని ఎంపీ కోమటిరెడ్డి ద్వజమెత్తారు.