రాహుల్​ది కాంగ్రెస్, టీఆర్ఎస్ జోడో యాత్ర: ఎంపీ లక్ష్మణ్

రాహుల్​ది కాంగ్రెస్, టీఆర్ఎస్ జోడో యాత్ర: ఎంపీ లక్ష్మణ్

హైదరాబాద్, వెలుగు : కాంగ్రెస్​కు ఓటేస్తే టీఆర్ఎస్​కు ఓటేసినట్లేనని బీజేపీ ఎంపీ లక్ష్మణ్​ అన్నారు. రాహుల్ గాంధీది కాంగ్రెస్, టీఆర్ఎస్ జోడో యాత్ర అని విమర్శించారు. బీజేపీని, ప్రధాని నరేంద్ర మోడీని ఎదుర్కొనేందుకు గుంపులు, గుంపులుగా వస్తున్నారని దుయ్యబట్టారు. సోమవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ హయాంలోనే అనేక కుంభకోణాలు జరిగాయని ఆరోపించారు. మోడీ మీద అరిగిపోయిన టేపు రికార్డ్ లాగా సీఎం కేసీఆర్ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. దేశమంతటా 50 మందికి ఒక బెల్ట్ షాపు పెట్టేందుకు దేశ రాజకీయాల్లోకి వస్తున్నారా అని కేసీఆర్ ను ప్రశ్నించారు. మునుగోడు ఉప ఎన్నిక అహంకారానికి.. ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న ఎన్నిక అని అన్నారు. మునుగోడు అభివృద్ధి కావాలంటే రాజగోపాల్ రెడ్డిని గెలిపించాలని కోరారు.

8 ఏండ్లుగా చేయనోళ్లు.. ఇప్పడేం చేస్తరు?

ఎనిమిదేళ్ళుగా రాష్ట్రానికి ఏమీ చేయని కేసీఆర్.. ఇప్పుడు కొత్తగా ఏదో చేస్తానని చెప్పుడేందని ప్రశ్నించారు. చేనేత మీద 5 శాతం జీఎస్టీకి తెలంగాణ ఆర్థిక మంత్రి ఒప్పుకొని సంతకం చేసింది నిజం కాదా అని అన్నారు. 20 లక్షల టర్నోవర్ మీద పన్ను కోరింది మీరు కాదా అని ఫైర్ అయ్యారు. నిజంగా చేనేత కార్మికుల మీద ప్రేమ ఉంటే రాష్ట్రానికి వచ్చే  2.5 శాతం పన్ను వదులుకోవచ్చు కదా అన్నారు. ఎనిమిదేళ్లలో అదనంగా మునుగోడులో ఒక్క గుంట భూమికి కూడా నీళ్ళు ఇవ్వలేదని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్సీ మోహన్ రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒకటో తేదీన ఉద్యోగులకు జీతాలు రావట్లేదన్నారు. ఉద్యోగులకు కేంద్రం 3 డీఏలు ఇస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇవ్వట్లేదని ప్రశ్నించారు.