
ఎల్బీనగర్/ముషీరాబాద్/సికింద్రాబాద్, వెలుగు: పేదల సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా ప్రధాని మోడీ నిరంతరం పనిచేస్తున్నారని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజసభ సభ్యుడు డాక్టర్ కె. లక్ష్మణ్ అన్నారు. శనివారం రాత్రి నాగోల్‌లోని ఓ గార్డెన్స్‌లో బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి ఆధ్వర్యంలో మహాజన్ సంపర్క్ అభియాన్ సభ నిర్వహించారు. దీనికి చీఫ్ గెస్ట్‌గా హాజరైన లక్ష్మణ్ మాట్లాడుతూ.. గత ఎన్నికల టైమ్‌లో ఇచ్చిన హామీలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నెరవేర్చిందని, ఆ విషయాలనే ఇంటింటికీ తిరుగుతూ చెప్తున్నామని తెలిపారు. పేదల సంక్షేమ కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 27 లక్షల కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. జనాలను మోసం చేస్తున్న బీఆర్ఎస్కు రాబోయే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో బీజేపీ ఎల్బీనగర్ సెగ్మెంట్ కన్వీనర్ కొత్త రవీందర్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, శ్యామల, బీజేపీ కార్పొరేటర్లు కొప్పుల నర్సింహారెడ్డి, మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు లోయర్ ట్యాంక్‌బండ్‌లోని బండ మైసమ్మ నగర్ కమిటీ హాల్లో జరిగిన ఇంటలెక్చువల్ సమావేశానికి లక్ష్మణ్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీని మూడోసారి అధికారంలోకి తీసుకొచ్చేందుకు మేధావులు సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. తార్నాకలోని నాగార్జున నగర్లో చేపట్టిన మహాజన్ సంపర్క్ అభియాన్ యాత్రలో మాజీ మేయర్ బండ కార్తీకారెడ్డి పాల్గొన్నారు. సుపరిపాలన కోసం వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీని గెలిపించాలని కోరారు.