కాంగ్రెస్, బీఆర్ఎస్​కు ఓటమి భయం : లక్ష్మణ్

కాంగ్రెస్, బీఆర్ఎస్​కు ఓటమి భయం : లక్ష్మణ్
  • కాంగ్రెస్, బీఆర్ఎస్​కు ఓటమి భయం
  • బీసీ సీఎం ప్రకటనతో వాళ్లకు నిద్రపట్టట్లే: లక్ష్మణ్

హైదరాబాద్, వెలుగు : బీసీని సీఎం చేస్తామని బీజేపీ ప్రకటించినప్పటి నుంచి కాంగ్రెస్, బీఆర్ఎస్​కు ఓటమి భయం పట్టుకుందని ఎంపీ లక్ష్మణ్ అన్నారు. అందుకే కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ ప్రకటించిందని విమర్శించారు. కొత్త సీసాలో పాత సారా అన్నట్లు బీసీ డిక్లరేషన్ ఉందని ఎద్దేవా చేశారు. శుక్రవారం సోమాజిగూడలోని బీజేపీ మీడియా సెంటర్​లో లక్ష్మణ్ మాట్లాడారు. బీసీలను కాంగ్రెస్ దూరంగా నెట్టేస్తే.. మోదీ అక్కున చేర్చుకున్నారన్నారు. విశ్వకర్మ యోజన స్కీమ్​తో ఎన్నో బీసీ కులాలకు లబ్ధి చేకూరుస్తున్నారని తెలిపారు. 

బీసీల నుంచి 26 కులాలను బీఆర్ఎస్ తొలగించిందన్నారు. బీసీ సీఎం ప్రకటన తర్వాత రాష్ట్ర ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్​లో అందరూ సీఎం పోస్టు కోసం పోటీపడ్తున్నారని ఎద్దేవా చేశారు. ఇందులో నల్గొండ జిల్లా వాళ్లే ఎక్కువగా ఉన్నారని విమర్శించారు. బీఆర్ఎస్​లో కేసీఆర్ తర్వాత కేటీఆర్ ఆ తర్వాత హిమాన్షు సీఎం అవుతాడని అన్నారు. బీజేపీలో మాత్రం బీసీ సీఎం అవుతాడని తెలిపారు. ఇన్నేండ్లు పాలించిన కాంగ్రెస్, బీఆర్ఎస్​లు బీసీని ఎందుకు సీఎం చేయలేదని ప్రశ్నించారు.