జూన్ నుంచి స్కూళ్లు, కాలేజీల్లో విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ :  ఎంపీ మల్లు రవి

జూన్ నుంచి స్కూళ్లు, కాలేజీల్లో విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ :  ఎంపీ మల్లు రవి
  • సీఎస్ఆర్ నిధులతో సర్కార్​ బడుల్లో టాయిలెట్ల నిర్మాణం
  • టెన్త్ టాపర్ల సన్మాన కార్యక్రమంలో ఎంపీ మల్లు రవి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు స్కూళ్లు, కాలేజీ విద్యార్థులకు జూన్ నెల నుంచి ఉదయం పూట అల్పాహారం అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి వెల్లడించారు.  సోమవారం రవీంద్ర భారతిలో బీసీ టీచర్స్ అసోసియేషన్ (బీసీటీఏ) ఆధ్వర్యంలో 33 జిల్లాల పదో తరగతి మండల టాపర్ల సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మల్లు రవి మాట్లాడుతూ.. విద్యార్థులను సన్మానించడం వారికి మానసిక బలాన్ని ఇస్తుందని, సమాజంలో మార్పు కేవలం విద్యతోనే సాధ్యమని పేర్కొన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా వంద తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ఏర్పాటు చేసి, పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని మల్లు రవి తెలిపారు. టెన్త్ ఫలితాల్లో నాగర్ కర్నూల్ జిల్లా రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలవడం సంతోషకరమని, తన పార్లమెంట్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్ల కొరత లేకుండా సీఎస్ఆర్ నిధులతో అన్ని సౌకర్యాలు కల్పిస్తానని చెప్పారు. 

పోరాటాలతోనే హాస్టళ్లు: ఆర్.కృష్ణయ్య

బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ విద్య ద్వారానే సమాజంలో విప్లవాత్మక మార్పులు వస్తాయన్నారు. 1974లో కేవలం ఎస్సీ, ఎస్టీలకే హాస్టల్ వసతి ఉండేదని, 1978లో తాము చేసిన పోరాటాల ఫలితంగానే బీసీలకు హాస్టళ్లు సాధించుకున్నామని వివరించారు. బీసీటీఏ రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణుడు మాట్లాడుతూ.. గతంలో రవీంద్ర భారతిలో సన్మానాలంటే కేవలం గొప్పవాళ్లకే పరిమితమయ్యేవని, కానీ నేడు సర్కారు స్కూళ్ల పేద విద్యార్థులను ఇక్కడ సన్మానించుకోవడం గర్వంగా ఉందన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల నుంచి 629 మంది మండల టాపర్లను గుర్తించి సన్మానం చేసినట్టు వివరించారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు హన్మంతరావు, బీసీటీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ గౌడ్, ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సదానంద్ గౌడ్, బీసీటీఏ రాష్ట్ర నేతలు సంపత్, రాఘవేందర్, బాలగోపాల్, వెంకట్, రామదాసు, రమేశ్ పాల్గొన్నారు.