- కేంద్రానికి ఎంపీ మల్లు రవి విజ్ఞప్తి
న్యూఢిల్లీ, వెలుగు: వికలాంగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల కన్వీనర్ మల్లు రవి కోరారు. యాక్సెసబుల్ ఇండియా క్యాంపెయిన్‌లో భాగంగా వికలాంగులకు ఉద్యోగాల్లో 4 శాతం, సంక్షేమ పథకాల్లో 5 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. శుక్రవారం లోక్‌సభ జీరో అవర్‌లో ఈ అంశాన్ని ఆయన లేవనెత్తారు. సామాజిక, ఆర్థిక భద్రతతో పాటు పునరావాసం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే, స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాలను విస్తరించాలని, వారికి పెన్లన్లు మంజూరు చేయాలని కోరారు. ఈ సమస్యలపై పరిష్కారానికి కేంద్ర సామాజిక భద్రత, సాధికారత శాఖ చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఎరువుల పంపిణీ బాధ్యత రాషానిదే: కేంద్రం
గత ఖరీఫ్ సీజన్‌లో తెలంగాణకు డిమాండ్ కంటే ఎక్కువ మొత్తంలో యూరియా సరఫరా చేశామని కేంద్రం వెల్లడించింది. ఖరీఫ్ సీజన్‌కు 9.80 లక్షల టన్నుల యూరియా అవసరం కాగా, 10.28 లక్షల టన్నులను అందుబాటులో ఉంచినట్లు పేర్కొంది. అయితే, రాష్ట్రంలో జిల్లాల వారీగా ఎరువులు పంపిణీ చేయాల్సిన బాధ్యత పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానిదేనని ఎంపీ మల్లు రవి ప్రశ్నకు కేంద్ర మంత్రి అనుప్రియా పటేల్ లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు.
