
బషీర్బాగ్, వెలుగు: తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. నాంపల్లిలోని తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ ముందు కాంట్రాక్టు ఉపాధ్యాయులు గురువారం ఆందోళనకు దిగారు. వీరికి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య మద్దతు పలికారు. గత 10 నెలలుగా జీతాలు అందకపోవడంతో కాంట్రాక్టు ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
ఏజెన్సీ విధానం వల్ల ఈ సమస్య వస్తుందని, ప్రభుత్వం తక్షణమే ఏజెన్సీ విధానాన్ని రద్దు చేసి.. నేరుగా జీతాలు చెల్లించాలని కోరారు. మైనారిటీ గురుకులలను బలోపేతం చేయాలంటే , సమర్ధవంతమైన ఫ్యాకల్టీ ఉండాలని.. అందుకోసం కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరించాలని విజ్ఞప్తి చేశారు. వేముల రామకృష్ణ, గుజ్జ కృష్ణ, పగడాల సుధాకర్, వంశీకృష్ణ, బాలకృష్ణ, రవి పాల్గొన్నారు.
ముషీరాబాద్: గ్రూప్- 1 పై హైకోర్టు ఇచ్చిన తీర్పును వెంటనే అమలు చేయాలని ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. టీజీపీఎస్సీ అనవసర జాప్యం చేయవద్దని, డివిజన్ బెంచ్, సుప్రీంకోర్టుకు వెళ్లినా ఇదే తీర్పు వస్తుందన్నారు. గురువారం విద్యానగర్బీసీ భవన్లో గ్రూప్-1 అభ్యర్థులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. టీజీపీఎస్సీ నిర్వహణ వైఫల్యం వల్లే గ్రూప్-1 పరీక్షలు అబాసుపాలైనట్లు ఆరోపించారు. డీఎస్సీ, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలను కూడా త్వరగా భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.