- సీఎం రేవంత్‌ను కోరిన ఎంపీ ఆర్.కృష్ణయ్య
హైదరాబాద్, వెలుగు: బీసీలపై రోజురోజుకు దాడులు పెరుగుతున్న నేపథ్యంలో వాటిని అరికట్టేందుకు ప్రత్యేకంగా బీసీ రక్షణ చట్టం తీసుకురావాలని సీఎం రేవంత్ రెడ్డిని ఎంపీ ఆర్ కృష్ణయ్య కోరారు. సోమవారం అసెంబ్లీలో బీసీ నేతలతో కలిసి ఆయన సీఎంను కలిశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల బీసీ రక్షణ చట్టం తీసుకువచ్చిన విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. నాగర్‌కర్నూల్‌లో ఇటీవల రజక కుటుంబంపై జరిగిన దాడిలో చిన్నారి మృతి చెందిందన్నారు. అలాగే నల్గొండలో యాదవులపై, కరీంనగర్‌లో నాయి బ్రాహ్మణులపై, నిజామాబాద్‌లో జరిగిన దాడుల వివరాలను సీఎంకు వివరించారు.
బీసీ రక్షణ చట్టంలో పకడ్బందీ గైడ్‌లైన్స్ రూపొందించాలని, ఎస్సీ, ఎస్టీలపై దాడులు జరిగితే తీసుకునే చర్యల తరహాలోనే బీసీల రక్షణకు కూడా స్పష్టమైన నిబంధనలు ఉండాలని సూచించారు. సుమారు 20 నిమిషాల పాటు జరిగిన ఈ భేటీలో ప్రతిపాదనలపై సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించినట్లు ఆర్.కృష్ణయ్య తెలిపారు. త్వరలోనే ఈ చట్టంపై నిర్ణయం తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారని పేర్కొన్నారు.
