సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల చెయ్యాలి

సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల చెయ్యాలి

సీఎస్ సోమేశ్ కుమార్ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. సెక్ర‌టేరియేట్ కూల్చివేత‌పై మంగ‌ళ‌వారం రేవంత్ జూమ్ యాప్ ద్వారా ప్రెస్ మీట్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. గవర్నర్ పిలిచినా వెళ్ళనందుకు సీఎస్‌ను- హెల్త్ ప్రిన్సిపల్ సెక్రెటరీని విధుల్లోంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. గవర్నర్ తమ హక్కులను ఉపయోగించుకోవాలని, గవర్నర్ కి ప్రభుత్వ అధికారులు స్పందించకపోతే కేంద్ర మంత్రి కలుగజేసుకోవాల‌ని అన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంత జరుగుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేద‌ని ప్రశ్నించారు. బీజేపీ-టీఆరెస్ కలిసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఆయ‌న విమర్శించారు.

సీఎం కేసీఆర్ హైదరాబాద్ ప్రజలను గాలికి వదిలేసి ఫామ్ హౌస్‌కి వెళ్లారని, పీవీ శతజయంతి రోజు మాయమైన‌ సీఎం ఇప్పటి వరకు కనిపించడం లేదని అన్నారు ఎంపీ. “ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచే రాబోయే 6 నెలలు సీఎం అన్ని కార్యక్రమాలు చేపడతారని అంటున్నారు.! మూడు రోజుల్లో కేబినెట్- లాక్ డౌన్ అని చెప్తే ప్రజలందరూ హైదరాబాద్ ఖాళీ చేస్తున్నారు. సెక్షన్-8 ని గవర్నర్ ఉపయోగించి హైదరాబాద్ లో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి “అని అన్నారు.

క‌రోనా బాధితుల‌కు చికిత్సనందించే విష‌యంలో ప్ర‌భుత్వం ఒక్కో పేషెంట్ పై 3.50 లక్షల ఖర్చు చేస్తునట్లుగా చెబుతుందని, ఎంతమంది కరోనా పేషెంట్లకు మూడున్నర లక్షల రూపాయలు ఖర్చు చేశారో చెప్పాలి? అని రేవంత్ డిమాండ్ చేశారు. దాతలు ఇచ్చిన నిధులను ప్రభుత్వం ఎలా ఖర్చు చేశారో శ్వేతపత్రం విడుదల చెయ్యాలన్నారు. సీఎం పర్యవేక్షణ లేని పాలనను కాపాడాల్సిన బాధ్యత గవర్నర్‌పై ఉందని, గవర్నర్ తక్షణమే అధికారులకు నోటీసులు ఇవ్వాల‌న్నారు.

సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల చెయ్యాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నానన్నారు. ప్రజా ప్రతినిధులపై కూడా ఒక హెల్త్ బులిటెన్ విడుదల చెయ్యాల‌న్నారు. ప్రభుత్వ తీరుపై గవర్నర్ అఖిలపక్షాన్ని పిలవాల‌న్నారు. హైదరాబాద్‌లోని భవనాలన్నీ గవర్నర్ ఆధీనంలో ఉంటాయని, సెక్రటేరియట్ కూల్చివేసే ముందు గవర్నర్ అనుమతి ప్రభుత్వం తీసుకుందా అని రేవంత్ ప్రశ్నించారు.