పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధితో పాటు, చారిత్రక నేపథ్యం కలిగిన రామగిరి ఖిల్లాను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని పార్లమెంట్‌లో గళమెత్తిన ఎంపీ గడ్డం వంశీకృష్ణ కృషి హర్షనీయమని ఓదెల మండలం మడక మాజీ ఎంపీటీసీ ఆవుల ముత్తయ్య, కరుణ సేవా సంస్థ వ్యవస్థాపకులు బచ్చల్లి రాజయ్య అన్నారు. పెద్దపల్లి ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. రామగిరి కోట కేవలం ఒక కట్టడం మాత్రమే కాదని,అది పూర్వీకుల శౌర్యానికి,శిల్పకళా వైభవానికి ప్రతీక అని పేర్కొన్నారు. ఇక్కడ లభించే అరుదైన ఔషధ మొక్కలు ఆయుర్వేద రంగానికి ఎంతో కీలకమని వివరించారు.
విశాలమైన ప్రాంగణం,ప్రకృతి అందాలతో అలరారే ఈ ప్రాంతాన్ని పర్యాటక హబ్‌గా మార్చాలని, కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మేరా గావ్ -మేరీ ధరోహర్ పథకం కింద రామగిరి కోటను చేర్చి ప్రత్యేక నిధులు కేటాయించాలని వారు విజ్ఞప్తి చేశారు. రామగిరిపై ఎంపీ వంశీకృష్ణ పార్లమెంట్‌లో మాట్లాడటంతో ఈ ప్రాంత ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బైరెడ్డి వీరరెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గోసిక రాజేశం తదితరులు పాల్గొన్నారు.
