పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ జిల్లా కలెక్టర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా రైతుల సమస్యలు, దళిత రైతుల పట్ల వివక్షపై ఆయన తీవ్రంగా స్పందించారు. పెద్దపల్లి జిల్లాలో 6 లక్షల టన్నుల మిల్లింగ్ సామర్థ్యం ఉన్నప్పటికీ.. కేవలం 2 లక్షల టన్నులే ఎందుకు కొనుగోలు చేశారని ఎంపీ ప్రశ్నించారు. పెద్దపల్లి రైతుల ధాన్యం మాత్రమే తీసుకుంటామన్న నిర్ణయం ఎవరిది? రైతులను చంపాలని డిసైడ్ అయ్యారా?" అంటూ నిలదీశారు. మంచిర్యాల జిల్లాలోని దళిత రైతుల పట్ల కలెక్టర్ ఎందుకు చిన్నచూపు చూస్తున్నారని మండిపడ్డారు. కలెక్టర్ తీరుపై సీఎస్‌కు లేఖ రాసినట్లు ఆయన వెల్లడించారు.
మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఎంపీ వంశీకృష్ణ ఆరోపించారు. బేటీ బచావో నినాదం ఏమైందని ప్రశ్నిస్తూ.. బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడిన వారికి బీజేపీ టికెట్లు ఇచ్చిందని విమర్శించారు.
రామగుండం ఫర్టిలైజర్ ఫ్యాక్టరీలో 70 శాతం ఉత్పత్తి జరుగుతున్నా.. తెలంగాణకు కేవలం 20 శాతం మాత్రమే యూరియా కేటాయించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎఫ్.సి.ఐ (FCI) తీరుతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, బీజేపీ నిజమైన రైతు ద్రోహి అని ధ్వజమెత్తారు. ఏటీసీ సెంటర్ ద్వారా యువతకు శిక్షణ ఇస్తున్నామని.. యువత కష్టపడితేనే అభివృద్ధి సాధ్యమని ఎంపీ వంశీకృష్ణ పిలుపునిచ్చారు.
