V6 News

పెద్దపల్లిలో సెమీ కండక్టర్ యూనిట్ పెట్టండి.. లోక్‌‌‌‌సభ జీరో అవర్‌‌‌‌‌‌‌‌లో.. కేంద్రాన్ని కోరిన ఎంపీ గడ్డం వంశీకృష్ణ

పెద్దపల్లిలో సెమీ కండక్టర్ యూనిట్ పెట్టండి.. లోక్‌‌‌‌సభ జీరో అవర్‌‌‌‌‌‌‌‌లో.. కేంద్రాన్ని కోరిన ఎంపీ గడ్డం వంశీకృష్ణ
  • రామగుండం- పెద్దపల్లి - మణుగూరు రైల్వే లైన్‌‌‌‌ను నిర్దేశిత గడువులోగా పూర్తిచేయండి
  • లోక్‌‌‌‌సభ జీరో అవర్‌‌‌‌‌‌‌‌లో కేంద్రాన్ని కోరిన ఎంపీ గడ్డం వంశీకృష్ణ
  • ఎంపీ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలోని పెద్దపల్లికి రావాల్సిన సెమీకండక్టర్ యూనిట్‌‌‌‌ను చివరి నిమిషంలో ఏపీకి తరలించారని ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఆ రోజు నుంచే తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. పెద్దపల్లి జిల్లాలో సెమీ కండక్టర్ యూనిట్​ వస్తే అభివృద్ధికి దోహదపడుతుందని లోక్ సభ వేదికగా డిమాండ్ చేశామని గుర్తు చేశారు. ఈ ప్రాంతం రాష్ట్రానికి, దేశానికి పెద్ద మొత్తంలో కంట్రిబ్యూట్​ చేస్తున్నదని, అందువల్ల పెద్దపల్లికి ఐటీ, సెమి కండక్టర్ ఫెసిలిటీ ఇవ్వాలని కోరారు.

ఈ నిర్ణయాలు పెద్దపల్లిలో పరిశ్రమల ఏర్పాటుతో పాటు  యువతకు ఉద్యోగాలు కల్పిస్తాయని సభకు వివరించారు. ఈ మేరకు బుధవారం లోక్‌‌‌‌‌‌‌‌‌‌సభ జీరో అవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తెలంగాణవ్యాప్తంగా ఆర్వోబీల నిర్మాణం, కొత్త రైల్వే లైన్ ప్రాజెక్ట్, పెండింగ్ అంశాలను లేవనెత్తారు. రామగుండం-–పెద్దపల్లి-–మణుగూరు రైల్వే లైన్‌‌‌‌‌‌‌‌ను నిర్దేశిత గడువులోగా పూర్తిచేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. 

రూ. 4 వేల కోట్లతో రామగుండం-–పెద్దపల్లి–-మణుగూరు రైల్వే లైన్‌‌‌‌‌‌‌‌కు డీపీఆర్ పూర్తైనట్టు సభ ద్వారా కేంద్ర రైల్వే, ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ దృష్టికి తెచ్చారు. కుందన్‌‌‌‌‌‌‌‌పల్లి రైల్ ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) కి రూ.120 కోట్లు, పెద్దపల్లికి కీలకమైన కన్నాల–-మంథనికి రూ. 89 కోట్లు, మంచిర్యాల–-హమ్నివాడ ఎఫ్‌‌‌‌‌‌‌‌వోబీకి రూ. 10 కోట్లు కేంద్రం కేటాయించిందన్నారు. 

డీపీఆర్ ఇవ్వండి.. సహకరిస్తం: అశ్వినీ వైష్ణవ్
పెద్దపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఎంపీ గడ్డం వంశీకృష్ణ లేవనెత్తిన అంశాలపై కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పందించారు. ఓదెల, కొలనూరుకు సంబంధించిన రెండు ప్రాజెక్టుల అలైన్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ పనులు చివరి దశలో ఉన్నాయని తెలిపారు. ఈ ప్రాంతాలను కేంద్రం, రాష్ట్రానికి సంబంధించిన అధికారులు సైతం విజిట్ చేసినట్లు వివరించారు. అక్కడి వాస్తవ సమస్యను పరిష్కరించేందుకు ఎంపీ గడ్డం వంశీకృష్ణ  కూడా వెళ్లాలని సూచించారు.

ఇతర ప్రాజెక్టుల విషయంలో భూసేకరణ పూర్తికాగానే పనులు మొదలుపెడతామని చెప్పారు. అలాగే, తెలంగాణలో ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్‌‌‌‌‌‌‌‌ ఎకో సిస్టం వేగవంతంగా సాగుతున్నదని తెలిపారు. దీంతోపాటు సెమీకండెక్టర్స్ ఎకో సిస్టం ఏర్పాటు కోసం ఎన్నో ప్రయత్నాలు జరిగాయని చెప్పారు. సెమీకండక్టర్ విషయంలో డీపీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఉంటే సమర్పించాలని ఎంపీ వంశీకృష్ణకు సూచించారు. వాటిని తప్పకుండా పరిశీలనలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు.