
- కలిసికట్టుగా హక్కులు సాధించుకోవాలి
- గోవా జాతీయ ఓబీసీ మహాసభ పోస్టర్ ఆవిష్కరణలో ఎంపీలు
హైదరాబాద్, వెలుగు : బీసీలంతా రాజకీయాలకు అతీతంగా ఐక్యం కావాలని వివిధ పార్టీల ఎంపీలు పిలుపునిచ్చారు. వచ్చే నెల 7న గోవాలో జరిగే 10వ జాతీయ ఓబీసీ మహాసభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మహాసభల పోస్టర్లను మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఆదివారం వారి ఇండ్లలో ఆవిష్కరించారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, బీసీ సంఘం నేతలు కలిసి ఆ పార్టీ నేతల ఇండ్లకు వెళ్లి మహాసభల పోస్టర్లను ఆవిష్కరింపజేశారు.
గోవా మహాసభలకు అటెండ్ కావాలని ఈ సందర్భంగా వారిని ఆహ్వానించారు. బీసీల చైతన్యం కోసం నిరంతరం సంఘాలు చేస్తున్న కృషి అభినందనీయమని ఎంపీలు పేర్కొన్నారు. ఇదే చైతన్యాన్ని, ఐక్యతను రానున్న రోజుల్లో కూడా కొనసాగించాలన్నారు. కలిసికట్టుగా హక్కులు సాధించుకోవాలని సూచించారు. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారి, మహాత్మ జ్యోతిబా పూలే జయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్ చి న్న శ్రీశైలం యాదవ్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు తాటికొండ విక్రమ్ గౌడ్ తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.