- జనాభా గణన నేపథ్యంలో రాష్ట్ర సర్కార్ ప్లాన్
- సర్ నిర్వహణకే ఈసీ షెడ్యూల్ ప్రకటించే చాన్స్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను జూన్ చివరి వారం లేదా జులైలో నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. పరీక్షలు ముగిశాక మే నెలలోనే ఎన్నికలు నిర్వహించాలని గతంలో యోచించినప్పటికీ, కేంద్ర ఎన్నికల సంఘం జనాభా గణన చేపట్టనుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియను ఈసీ వాయిదా వేసింది.
మే 4న ఇతర రాష్ట్రాల ఫలితాలు వెలువడిన తర్వాతే తెలంగాణలో 'సర్' షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలో జనాభా గణన ప్రక్రియ మే 11న ప్రారంభమై జూన్ 9 వరకు కొనసాగనుంది. దీనికంటే ముందుగా ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు ప్రజలే స్వయంగా వివరాలు నమోదు చేసుకునే 'సెల్ఫ్ ఎన్యుమరేషన్'కు అవకాశం కల్పించారు.
దాదాపు 33 రకాల ప్రశ్నలతో కూడిన ఈ సర్వే కోసం సిబ్బంది ఇంటింటికీ తిరగాల్సి ఉంటుంది. బూత్ స్థాయి అధికారులు బీఎల్ఓలు ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులపై దృష్టి సారించాల్సి ఉండటంతో క్షేత్రస్థాయి యంత్రాంగం మే నెలలో బిజీగా ఉండనుంది. ఈ నేపథ్యంలో జూన్ ఆఖరు లేదా జులైలో పోలింగ్ నిర్వహించేలా సర్కార్ ప్లాన్ చేసింది.

