- అకస్మాత్తుగా లాగ్ అవుట్ అయిన అకౌంట్లు
- సుమారు 3 గంటలు కొనసాగిన అంతరాయం
- హ్యాక్ అయ్యిందంటూ యూజర్ల తీవ్ర ఆందోళన
హైదరాబాద్ సిటీ, వెలుగు: ప్రముఖ సోషల్‌మీడియా దిగ్గజం ‘మెటా’కి చెందిన ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ అప్లికేషన్లు శుక్రవారం రాత్రి ఒక్కసారిగా నిలిచిపోయాయి. గ్లోబల్ అవుటేజ్ కారణంగా కోట్ల మంది యూజర్ల అకౌంట్లు ఆటోమేటిక్‌గా లాగ్ అవుట్ అయ్యాయి. తిరిగి లాగిన్ అవ్వడానికి ప్రయత్నించినా కాలేదు. తమ అకౌంట్లు హ్యాక్ అయ్యాయేమోనని యూజర్లు గందరగోళానికి గురయ్యారు.
ఇదివరకు జూన్ 6న కూడా మెటా నెట్‌వర్క్‌లో చిన్నపాటి అంతరాయం ఏర్పడింది. అసలు ఏం జరిగిందో తెలుసుకునేందుకు యూజర్లంతా ‘ఎక్స్’ (ట్విట్టర్)ను ఆశ్రయించారు. అక్కడ ‘డౌన్ డిటెక్టర్’లో వేలాది ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ అంతరాయం సుమారు 3 గంటల పాటు కొనసాగింది. ఆ తర్వాత టెక్నికల్ టీం సమస్యను పరిష్కరించింది.
- 356 కోట్ల మంది యాక్టివ్ యూజర్లు
మెటా నెట్‌వర్క్‌కు ప్రపంచవ్యాప్తంగా 356 కోట్ల మంది యాక్టివ్ యూజర్లు ఉన్నారు. వాళ్లంతా ఈ అవుటేజ్ వల్ల తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
2026 అంచనాల ప్రకారం యూజర్ల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా ఫేస్‌బుక్‌కు 307 కోట్లు, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌లకు చెరో 280 నుంచి 300 కోట్ల మంది నెలవారీ యాక్టివ్ యూజర్లు ఉన్నారు. మన దేశంలో ఫేస్‌బుక్ యూజర్లు గరిష్టంగా 69 కోట్లు, ఇన్‌స్టాగ్రామ్‌కు 53 కోట్లు, వాట్సాప్‌కు 53.5 కోట్ల మంది వరకు ఉన్నారు. హైదరాబాద్‌లోని సుమారు 1.1 కోట్ల జనాభాలో ఇంటర్నెట్ వ్యాప్తిని బట్టి చూస్తే.. దాదాపు 50–55 లక్షల మంది ఫేస్‌బుక్, 40 లక్షల మంది ఇన్‌స్టాగ్రామ్, 55–60 లక్షల మంది వాట్సాప్ వినియోగదారులు ఈ సమస్య వల్ల ఇబ్బంది పడ్డారు.
- కోట్ల మందిపై ప్రభావం
మెటా యాప్‌లకు భారతదేశం అతిపెద్ద మార్కెట్. ఇంత భారీ యూజర్ బేస్ ఉన్న దేశంలో చిన్నపాటి సర్వర్ లోపం వచ్చినా దాని ప్రభావం కోట్ల మందిపై పడుతుంది. అయితే డౌన్ డిటెక్టర్ లాంటి సైట్లలో కేవలం సాంకేతిక పరిజ్ఞానం
ఉండి, ఫిర్యాదు చేసిన కొన్ని లక్షల మంది వివరాలు మాత్రమే కనిపిస్తాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మెసేజ్‌లు వెళ్లక, లాగిన్ కాలేక ఇబ్బంది పడే అసలు బాధితుల సంఖ్య అధికారిక రిపోర్ట్‌ల కంటే వందల రెట్లు ఎక్కువగా (కోట్లలో) ఉంటుందని నిపుణులు అంటున్నారు.
- కారణమేంటి?
నెట్‌వర్క్ ఫెయిల్: ఇలాంటి పెద్ద అవుటేజ్‌లకు సాధారణంగా సర్వర్ డేటా సెంటర్‌లో నెట్ వర్క్ ఫెయిల్ లేదా పవర్ కట్ సమస్య ఉంటుంది.
బిజీపీ రూటింగ్: ఇంజనీర్లు కొత్త అప్‌డేట్ పుష్ చేసినప్పుడు బీజీపీ రూటింగ్‌లో పొరపాట్లు జరిగితే ఇంటర్నెట్ నుంచి మెటా సర్వర్లు మాయమవుతాయి.
డీఎన్‌ఎస్ సమస్య: యాప్‌లను వెతికే డొమైన్ నేమ్ సిస్టమ్ (డీఎన్‌ఎస్) సర్వర్లు డౌన్ కావడం వల్ల లాగిన్ చేసినప్పుడు ‘అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఎర్రర్’ అని చూపిస్తుంది.
సైబర్ దాడి: ఒకేసారి కోట్ల ఫేక్ రిక్వెస్ట్‌లను పంపడం వల్ల సర్వర్లు క్రాష్ కావడం. మెటా భద్రతా వ్యవస్థ దృష్ట్యా ఇది చాలా అరుదు.
- ఇదే మొదటిసారి కాదు
మెటా సర్వర్లు ఇలా డౌన్ కావడం ఇదే మొదటిసారి కాదు. చాలా సార్లు ఇలాంటి సమస్యలు తలెత్తాయి. 2021 అక్టోబర్ 4న జరిగిన 6 గంటల మెగా అవుటేజ్ చరిత్రలోనే అత్యంత పెద్ద విపత్తు. ప్రపంచవ్యాప్తంగా 300 కోట్లకు పైగా యూజర్లపై ప్రభావం పడింది. మెటా ఉద్యోగుల ఇంటర్నల్ ఐడీ కార్డ్ సిస్టమ్స్ కూడా పనిచేయకుండా పోయాయి.
2024 మార్చి 5న రాత్రి 9 గంటలకు ఒక్కసారిగా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లతో పాటు గూగుల్, జీమెయిల్, యూట్యూబ్ కూడా డౌన్ అయ్యాయి. 2023 జూన్ 17న జరిగిన మరో గ్లోబల్ అవుటేజ్‌లో వాట్సాప్, మెసెంజర్ 2 గంటల పాటు నిలిచిపోయాయి.
