- నేటి నుంచి 18 వరకు మృత్యుంజయస్వామి బ్రహ్మోత్సవాలు
మధిర, వెలుగు : మధిరలోని మృత్యుంజయస్వామి ఆలయం శివరాత్రి ఉత్సవాలకు ముస్తాబైంది. ఈ ఆలయానికి ఒకవైపు వైరా నది, మరోవైపు స్మశానవాటిక ఉండడంతో కాశీలోని పవిత్ర క్షేత్రంగా భక్తులు భావిస్తారు. ఈ ఉత్సవాలకు ఖమ్మం జిల్లాతోపాటు ఆంధ్రప్రదేశ్ లోని ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు జిల్లాలు నుంచి భక్తులు భారీగా తరలిరానున్నారు. శనివారం ఉత్సవాలకు అంకురారోపణ, స్వామివారిని పెళ్లికొడుకుగా తయారు చేయడం, మామిడి తోరణాల అలంకరణ, ధ్వజారోహణం, అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాలు చేపట్టనున్నారు.
ఆదివారం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఉదయం నుంచి ప్రత్యేక అభిషేకాలు, మృత్యుంజయస్వామి వారి కల్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. బుధవారం ఉత్సవాల ముగింపు సందర్భంగా పూర్ణాహుతి నిర్వహించనున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి జగన్మోహన్ రావు తెలిపారు.
కూసుమంచిలో భారీ శివలింగం..
కూసుమంచి, వెలుగు : ఖమ్మం పట్టణానికి 20 కిలో మీటర్ల దూరంలోని కూసుమంచిలో ఉన్న శివాలయం ఉంది. క్రీస్తు శకం 1162 ప్రాంతంలో కూసుమంచిలో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. రామలింగేశ్వరస్వామిగా పూజలందుకుంటున్న శివుడు కాలం గడుస్తున్న కొద్దీ గణేశ్వరస్వామిగా ప్రసిద్ది చెందాడు. గర్భాలయంలోని శివ లింగం 12 అడుగుల ఎత్తు, 6.3 కైవారంతో ఏకశిలా రూపంగా నిర్మించారు. ఆసియా ఖండంలోనే అతి పెద్ద శివలింగాల్లో ఇది రెండోది. ఈనెల 14,15,16 వరకు ఈ ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు.
