అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా షానియల్ డియో దర్శకుడిగా పరిచయం అవుతోన్న చిత్రం ‘డెకాయిట్’. బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియా యార్లగడ్డ నిర్మిస్తున్నారు. సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, గ్లింప్స్‌తో సినిమాపై ఆసక్తిని పెంచగా, శుక్రవారం ఫస్ట్ సాంగ్‌ను రిలీజ్ చేశారు.
‘మోసం చేస్తావని తెలియదు కదా జూలియట్.. ఎందుకు నమ్మించినావే..’ అనే వాయిస్ ఓవర్‌తో మొదలైన పాటను భీమ్స్ సిసిరోలియో కంపోజ్ చేయడంతోపాటు చిన్మయి శ్రీపాదతో కలిసి పాడిన తీరు ఆకట్టుకుంది. ‘మళ్లీ మళ్లీ నిన్నే చూడాలని అంటున్నది మనసే.. కాసేపు నువ్వు నేను కలిసే.. క్షణంలో లోకమంతా తెలిసే.. నువ్వే నాకు దాదాపుగా అయిపోయావే అలవాటుగా.. ఎంత ఎంత నేనాపినా నా ప్రాణమే ఆగనంటంటోందిగా..రుబారూ రుబారూ.. ’ అంటూ భాస్కరభట్ల రవికుమార్ అందించిన లిరిక్స్ ప్రేమ, బాధల కలయికగా అందరినీ హత్తుకుంటోంది. శేష్, మృణాల్ జంట మధ్య కెమిస్ట్రీ ఈ పాటకు ఎమోషనల్ పవర్. ‘ప్రేమ అన్నావ్, పెళ్లి అన్నావ్, నువ్వే నా జీవితం అనుకున్నా. చివరికి జీవితాన్నే నాశనం చేశావు కదే..జూలియట్’ అంటూ పాట చివరిలో వారి ప్రేమలోని మాధుర్యం, తర్వాత జరిగే ద్రోహం వల్ల కలిగే బాధను చూపించిన విధానం ఇంప్రెస్ చేసింది. తెలుగు, హిందీలో ఒకేసారి తెరకెక్కుతోన్న ఈ చిత్రం ఏప్రిల్ 10న పాన్-ఇండియా వైడ్‌గా విడుదల కానుంది.
