MS Dhoni: ఆత్మహత్య చేసుకున్న ధోని వీరాభిమాని.. అదే ఇంట్లో ప్రాణాలు వదిలాడు

MS Dhoni: ఆత్మహత్య చేసుకున్న ధోని వీరాభిమాని.. అదే ఇంట్లో ప్రాణాలు వదిలాడు

భార‌త మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి వీరాభిమానిగా పేరొందిన గోపి కృష్ణన్ ఆత్మహ‌త్య చేసుకున్నాడు.  శుక్రవారం(జనవరి 19) తెల్లవారుజామున 4.30 సమయంలో కడలూరు జిల్లాలోని అరంగుర్‌లోని తన ఇంటిలో ఆత్మహ‌త్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆర్థిక లావాదేవీలే అతని ఆత్మహ‌త్యకు కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

కడలూరు జిల్లా పరిధిలో ధోనీ అభిమాని అనగానే అందరికి ముందుగా గుర్తొచ్చేది..గోపి కృష్ణన్. అలాంటి అతను త‌నువు చాలించి వారి కుటుంబంలోనే కాక స్థానికంగాను విషాదం నింపాడు. కృష్ణన్ సోదరుడిగా చెప్పుకున్న రామ్ అనే యువకుడు.. తన సోదరుడికి పొరుగు గ్రామంలోని కొంతమంది వ్యక్తులతో ఆర్థిక వివాదాలు ఉన్నాయని, వాటి విషయమై ఇటీవల గొడవ పడ్డాడని మీడియాకు తెలియజేశాడు. ఈ సంఘటన తర్వాత అతను మనస్తాపానికి గురయ్యాడని తెలిపాడు. ఇదే అతని ఆత్మహ‌త్యకు దారి తీసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. రామనాథం పోలీసులు అసహజ మరణంగా కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నారు.

ధోని అభిమాని ఇళ్లు

చెన్నై సూప‌ర్ కింగ్స్ అన్నా, ధోని అన్నా గోపి కృష్ణన్‌కు ఎనలేని అభిమానం. ఆ మక్కువతోనే అతను 2020లో త‌న ఇంటిని ప‌సుపు మయం చేశాడు. ఇల్లంతా సీఎస్కే జెర్సీ రంగులో చూడ‌ముచ్చట‌గా తీర్చి దిద్దాడు.అంతేకాదు ఆ ఇంటిని 'హోమ్ ఆఫ్ ధోనీ ఫ్యాన్' అని అందరికి కనపడేలా పెద్ద పెద్ద అక్షరాలతో రాయించాడు. ఆ ఇంటి వీడియో అప్పట్లో సోష‌ల్‌మీడియాలో బాగా వైర‌ల్ అయింది. ఆ వీడియో చూసి ధోనీ కూడా.. అతని కుటుంబాన్ని అభినందిస్తూ వీడియో విడుద‌ల చేశారు.