IPL 2026: ధోనీ పేరుతో మోసం చేశారు.. చెన్నై మేనేజ్మెంట్‎పై మాజీ క్రికెటర్ క్రిస్ శ్రీకాంత్ ఫైర్

IPL 2026: ధోనీ పేరుతో మోసం చేశారు.. చెన్నై మేనేజ్మెంట్‎పై మాజీ క్రికెటర్ క్రిస్ శ్రీకాంత్ ఫైర్

చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై భారత మాజీ క్రికెటర్ క్రిస్ శ్రీకాంత్ ఫైర్ అయ్యారు. ధోని పేరుతో చెన్నై అభిమానులను మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధోనీకి ఫిట్ నెస్ లేదు ఆడలేడనే విషయం ముందే తెలిసినప్పటికీ.. నెక్ట్స్ మ్యా్చ్ నెక్ట్స్ మ్యాచ్ అంటూ ఆశ పెట్టి ఫ్యాన్స్‎ను చీట్ చేశారని మండిపడ్డారు. ధోనీ ఆడలేడనే సంగతి ముందే చెబితే  అభిమానులు ఆశలు పెట్టుకునే వారు కాదన్నారు. 

ధోనీ విషయంలో చెన్నై యాజమాన్యం, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్‌ అభిమానులను ఉద్దేశపూర్వకంగా మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సీజన్ మొత్తం ఒక్క మ్యాచ్ కూడా ఆడడని తెలిసినప్పటికీ.. చెన్నై యాజమాన్యం పథకం ప్రకారం అస్పష్టమైన సమచారం, ప్రాక్టీస్ వీడియోలను షేర్ చేసి ఫ్యాన్స్‎ను పిచ్చోళ్లను చేసిందన్నారు.

 ప్రతి సారి నెక్ట్స్ మ్యాచ్ ఆడతాడంటూ ఫ్యాన్స్ ను గొర్రెలను చేశారని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. చెన్నై ఇకనైనా ఈ మోసాన్ని ఆపాలని కోరారు. ధోనీ ఫిట్‎గా లేడు.. ఈ సీజన్‎లో ఆడలేడని క్లియర్ కట్‎గా చెబితే అభిమానులు హోప్స్ పెట్టుకోకుండా మానసికంగా సిద్ధపడేవారని అన్నారు. అయినా ధోనీ కోసం ఎవరూ ఎదురు చూడటం లేదని.. అతడు లేని లోటు ఎవరికీ తెలియడం లేదని షాకింగ్ కామెంట్స్ చేశారు. 

ధోనీ శకం ముగిసిపోయిందని.. ఐపీఎల్ అందించిన గొప్ప క్రికెటర్లలో గొప్ప కెప్టెన్లలో ధోనీ ఒకడని అన్నారు. ధోనీ ఆడడనే విషయాన్ని సీజన్‎కు ముందే స్పష్టంగా చెప్పి ఉండాల్సిందని.. అలా కాకుండా అభిమానులను ఎందుకు మోసం చేస్తూనే ఉన్నారని చెన్నై యాజమాన్యాన్ని నిలదీశారు. కాగా, తొడ కండరాల గాయం కారణంగా ధోనీ ఈ సీజన్ మొత్తానికి దూరమైన సంగతి తెలిసిందే. మిడ్ సీజన్లో ధోనీ అందుబాటులోకి వస్తాడని లీగ్ మొదట చెప్పినప్పటికీ ధోనీ మాత్రం టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. దీంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. 

ఈ సీజన్‎లో 14 లీగ్ మ్యాచులు ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ 6 విజయాలు సాధించి.. 8 మ్యాచుల్లో ఓటమి పాలైంది. 12 పాయింట్లతో 7వ స్థానంలో నిలిచి లీగ్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ సీజన్ లో ఆ జట్టు స్టార్ ప్లేయర్ ఎమ్మెస్ ధోనీ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. 

కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కూడా అంచనాల మేర రాణించడంలో విఫలమయ్యాడు. ఈ ప్రభావం జట్టు విజయావకాశాలపై తీవ్రంగా పడింది. వేలంలో భారీ ధరకు కొనుగోలు చేసిన యంగ్ ప్లేయర్స్ కార్తీక్ శర్మ, ప్రశాంత్ వీర్ ధరకు తగ్గ న్యాయం చేయలేకపోయారు. ఇన్‎ఫామ్ బ్యాటర్ ఆయుష్ మాత్రే గాయం కారణంగా టోర్నీ మధ్యలోనే వైదొలగడం కూడా చెన్నైను దెబ్బకొట్టింది.