ముదిరాజ్ లను బీసీ‌‌‌‌‌‌‌‌–ఏ కేటగిరీలో చేర్చాలి.. సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీని కోరిన మంత్రి వాకిటి శ్రీహరి

ముదిరాజ్ లను బీసీ‌‌‌‌‌‌‌‌–ఏ కేటగిరీలో చేర్చాలి..    సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీని కోరిన మంత్రి వాకిటి శ్రీహరి

హైదరాబాద్, వెలుగు: ముదిరాజ్​ల సామాజిక, ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా వారిని బీసీ–డి కేటగిరీ నుంచి మార్చి బీసీ–ఏ కేటగిరీలో చేర్చాలని మంత్రి వాకిటి శ్రీహరి, ముదిరాజ్ కార్పొరేషన్​ చైర్మన్​ బొర్ర జ్ఞానేశ్వర్ ముదిరాజ్ కోరారు. ఈ మేరకు శనివారం సెక్రటేరియెట్ లో ముదిరాజ్ అసోసియేషన్​ స్టేట్ ప్రెసిడెంట్ చొప్పరి శంకర్ ముదిరాజ్ తో కలిసి సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రికి వినతిపత్రం అందజేశారు.

 కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ లో ముదిరాజ్ లకు ఇచ్చిన హామీని అమలు చేయాలన్నారు. 2009లో అప్పటి సీఎం, దివంగత వైఎస్సార్ జీవో ఎంఎస్ 15 ద్వారా ముదిరాజ్ లను బీసీ–ఏ కేటగిరీలో చేర్చగా.. వివిధ కారణాల వల్ల అమలుకు నోచుకోలేదని గుర్తు చేశారు. ముదిరాజ్​ల సామాజిక స్థితిగతులపై సర్వే చేసి, ఆ రిపోర్ట్ ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని 2022లో సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి, తెలంగాణ బీసీ కమిషన్ కు సూచించిందని తెలిపారు. కానీ, గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల అది అమలుకు నోచుకోలేదని ఆరోపించారు. 2024 కులగణన సర్వేలో ముదిరాజ్‌‌లు అత్యంత వెనకబడి ఉన్నట్లు తేలిందన్నారు. ఈ సర్వేను పరిగణలోకి తీసుకొని ముదిరాజ్ లను బీసీ–ఎ కేటగిరీలోకి మార్చాలని కోరారు.