నిర్భయ నిధికి ములుగు జిల్లా ఎంపిక

నిర్భయ నిధికి ములుగు జిల్లా ఎంపిక
  • కేంద్ర మంత్రికి మంత్రి సీతక్క కృతజ్ఞతలు

న్యూఢిల్లీ, వెలుగు: కేంద్ర  ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నిర్భయ నిధి స్కీం కింద  తెలంగాణలోని ములుగు జిల్లాను ఎంపిక చేయడంపై తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు. శనివారం ఢిల్లీలో కేంద్ర మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణదేవిని సీతక్క మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మహిళా సాధికారత, భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం చూపిస్తున్న చొరవను అభినందించారు. తెలంగాణలో ఈ పథకాన్ని అమలు చేస్తున్నందుకు కృతజ్ఞతలు చెప్పారు. 

కాగా... “మహిళలు, బాలికల కోసం సమ్మిళిత నగరాలు” పేరిట కేంద్రం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ పథకం ద్వారా ములుగు జిల్లాలో మహిళలు, బాలికల భద్రత, గౌరవం, రాకపోకల సౌకర్యాన్ని మెరుగుపరిచేందుకు జెండర్–రెస్పాన్సివ్  మౌలిక సదుపాయాలు, మెరుగైన నిఘా వ్యవస్థలు, అత్యవసర స్పందన వ్యవస్థలను ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టును విజయవంతంగా అమలు చేసేందుకు అవసరమైన డీపీఆర్  తయారీలో.. జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ, రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ పూర్తి సహకారాన్ని అందిస్తుందని మంత్రికి సీతక్క తెలిపారు.

క్రెచ్ వర్కర్లు, హెల్పర్ల జీతాలు పెంచాలని వినతి

పాలనా స్కీం - మిషన్  శక్తి పథకం కింద పనిచేస్తున్న క్రెచ్  వర్కర్లు, హెల్పర్ల గౌరవ వేతనాలను పెంచాలని కేంద్ర మంత్రి అన్నపూర్ణదేవికి మంత్రి సీతక్క విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం క్రెచ్  వర్కర్లకు నెలకు రూ.5,500, హెల్పర్లకు రూ.3,000 మాత్రమే గౌరవ వేతనంగా ఇస్తున్నారని గుర్తుచేశారు. ప్రజాస్వామ్యానికి తన జీవితం అంకితం ఇస్తున్నానని మంత్రి సీత‌‌‌‌‌‌‌‌క్క అన్నారు. దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో ముందంజలో ఉన్న మహిళా నాయకులను ఒక వేదికపైకి తీసుకువచ్చిన షీ స్పార్క్స్ 2026  కార్యక్రమంలో సీత‌‌‌‌‌‌‌‌క్క మాట్లాడారు.