ముంబయి విమానాశ్రయంలో సర్వర్ డౌన్... పునరుద్ధరణ

ముంబయి విమానాశ్రయంలో సర్వర్ డౌన్... పునరుద్ధరణ

దేశంలోనే రెండో అతిపెద్ద విమానాశ్రయమైన ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సర్వర్ వైఫల్యం కారణంగా భారీ గందరగోళం నెలకొంది. ప్యాసింజర్ చెక్-ఇన్ సిస్టమ్, బ్యాగేజీ హ్యాండ్లింగ్ సిస్టమ్ గంటకు పైగ పనిచేయకపోవడంతో దాదాపు 40నిమిషాల వరకు వరకు చెక్-ఇన్ ప్రక్రియను నిలిపివేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంలో ఎయిర్ పోర్ట్ లో ప్రయాణికులు భారీ క్యూలు దర్శనమిచ్చాయి. దీంతో విమానాశ్రయంలో రద్దీ నెలకొంది. నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనుల నేపథ్యంలో నెట్ వర్క్ లో అంతరాయం ఏర్పడిందని, ప్రయాణికులు చెక్ ఇన్ కోసం అదనపు సమయం వెచ్చించాలని ఈ సందర్భంగా విమానయాన సంస్థ విజ్ఞప్తి చేసింది. జరిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని, ప్రయాణికులు సహకరించాలని విన్నవించుకుంది. 

దాంతోపాటు సమస్యను పరిష్కరిస్తున్నామని, కొద్దిసేపట్లో సర్వీసులు తిరిగి ప్రారంభమవుతాయని విమానాశ్రయం తెలిపిన కాసేపటికే కార్యకలాపాలు పునఃప్రారంభమవడంతో ప్రయాణికులు రిలీఫ్ అయ్యారు. ఇక సర్వర్ డౌన్ అయిన సందర్భంలో క్యూలైన్లలో ఉన్న కొందరు తమ పరిస్థితిని తెలియజేస్తూ, ట్విట్టర్ లో కొన్ని పోస్టులు చేశారు. ఈ నేపథ్యంలో తన బ్యాగ్‌ని చెక్- ఇన్ కౌంటర్‌లో ఉంచిన వెంటనే సిస్టమ్ క్రాష్ అయ్యిందని ఓ ట్విట్టర్ యూజర్‌ తెలిపారు.