పిల్లలను గవర్నమెంట్ స్కూల్స్లో జాయిన్ చేస్తే ఇంటి పన్ను, నల్లా పన్ను కట్టనక్కర్లేదు !

పిల్లలను గవర్నమెంట్ స్కూల్స్లో జాయిన్ చేస్తే ఇంటి పన్ను, నల్లా పన్ను కట్టనక్కర్లేదు !

బొమ్మకల్: కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం బొమ్మకల్ గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆదర్శ నిర్ణయం తీసుకుంది. గ్రామంలోని తల్లిదండ్రులు తమ పిల్లలను స్థానిక ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తే వారి కుటుంబాలకు ఇంటి పన్ను, నల్లా పన్నుల నుంచి పూర్తి మినహాయింపు కల్పిస్తామని గ్రామ పంచాయతీ తీర్మానించింది.

గ్రామంలోని పిల్లలందరూ ప్రభుత్వ పాఠశాలల్లోనే చదవాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సర్పంచ్ వేముల శ్రీకాంత్ తెలిపారు. అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులోనూ ప్రాధాన్యత కల్పిస్తామని పేర్కొన్నారు. 

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతున్న క్రమంలో పాఠశాలలను పరిరక్షించాలనే సంకల్పంతో గ్రామస్తుల సహకారంతో ఈ తీర్మానం చేసినట్లు ఆయన వివరించారు. గ్రామ పంచాయతీ నిర్ణయాన్ని స్వాగతించిన పలువురు తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలలకు మార్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు.

►ALSO READ | MRO ట్రాన్స్ఫర్.. పటాకులు పేల్చి, స్వీట్లు పంచుకుని స్థానికుల సంబరాలు.. కరీంనగర్ చిగురుమామిడిలో ఘటన

పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మాట్లాడుతూ.. బడిబాట కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ పాఠశాలల ప్రాధాన్యతను వివరించామని చెప్పారు. గ్రామ పంచాయతీ పన్ను మినహాయింపు ప్రకటించడంతో ఇప్పటివరకు 12 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చేరారని.. మరికొందరు తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను చేర్పించేందుకు ఆసక్తి చూపుతున్నారని వెల్లడించారు.