రాత్రులు బీచుల్లో పడుకుంటున్న జనం.. కరెంట్ కోతల దెబ్బకు జనం విలవిల

రాత్రులు బీచుల్లో పడుకుంటున్న జనం.. కరెంట్ కోతల దెబ్బకు జనం విలవిల

భారత్లో సూపర్ ఎల్నినో పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎండలకు జనం అల్లాడిపోతున్నారు. జూన్ నెల వచ్చి 15 రోజులు దాటినా ఎండలు మాత్రం మే నెలలో మాదిరిగా నిప్పులు కురిపిస్తు్న్నాయి. ఈ ఎండలకు తోడు కరెంట్ కోతలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. పగలంతా పని చేసొచ్చి రాత్రి ప్రశాంతంగా పడుకుందామంటే కరెంట్ ఉండటం లేదు.

మరీ ముఖ్యంగా.. ముంబై మహా నగరంలో పవర్ కట్స్ స్థానికులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఈ కరెంట్ కోతలను భరించలేక జనం ఇళ్లకు తాళాలేసి దగ్గర్లో బీచ్ ఉండటంతో.. వెళ్లి బీచ్ ఒడ్డున రాత్రుళ్లు నిద్రపోతున్నారు. కొంచెం వింతగా అనిపించినా ఇది నిజం. ఇళ్లలోనే ఉండి ఉక్కపోతలతో ఉక్కిరిబిక్కిరి అవడం కంటే బీచ్ ఒడ్డున అలల హోరుకు వచ్చే గాలికి హాయిగా నిద్రపోవడం బెటర్ అని ముంబై జనం.. వెర్సోవా బీచ్‌లో నిద్రపోతున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

►ALSO READ | దరిద్రమైన వీడియోలకు.. మాఫియాలకు అడ్డాగా టెలిగ్రామ్ : ఢిల్లీ హైకోర్టులో కేంద్రం వాదన

ఇలా బీచ్లో నిద్రిస్తున్న వాళ్లంతా.. వెర్సోవా బీచ్ దగ్గరలో ఉన్న ఇందిరా నగర్ మురికివాడ వాసులని.. రేకుల ఇళ్లలో వేడి భరించలేనంతగా పెరగడంతో ఇలా బీచ్ ఒడ్డుకు చేరుకుని నిద్రపోతున్నారని తెలిసింది. ఎల్ నినో కారణంగా నైరుతి రుతుపవనాలు ఆలస్యం కావడంతో ముంబైలో నీటి నిల్వలు మొత్తం సామర్థ్యంలో 10 నుంచి12 శాతానికి పడిపోయాయి. దీంతో.. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) మే 15 నుంచి ముంబై అంతటా 10 శాతం నీటి కోతను అమలు చేసింది. 

గత నెల రోజులుగా ముంబై మహా నగరంలో విద్యుత్ కోతల కారణంగా జనం అర్ధరాత్రి ఒంటి గంట నుంచి 4 గంటల వరకూ ఇళ్లలో బదులు వీధుల్లోనే గడుపుతున్నారు. ఈ అప్రకటిత విద్యుత్ కోతలతో ముంబైలో సామాన్య, మధ్య తరగతి జనం ఇళ్లలో ఉండలేక.. అస్తమానం రోడ్ల మీద ఉండలేక నరకయాతన అనుభవిస్తున్నారు.