
ముంబై: దేశ వాణిజ్య రాజధాని ముంబైలో శనివారం భారీ వర్షాలు కురిశాయి. సబర్బన్ ఏరియాల్లో ఈదురు గాలులతో వానలు దంచికొట్టాయి. ఈస్టర్న్ సబర్బ్ లో 8.94. వెస్టర్న్ సబర్బ్ లో 8.14 వర్షపాతం రికార్డయింది. సిటీలో చాలా చోట్ల రోడ్లు వర్షపు నీటితో నిండిపోయాయి. ట్రాఫిక్ ఎక్కడికక్కడ స్తంభించింది. పాదచారులు మోకాలిలోతు నీటిలో నడుచుకుంటూ వెళ్లారు. ఆదివారం కూడా సిటీతో పాటు సబర్బన్ ఏరియాల్లో భారీ వానలు కొనసాగే అవకాశం ఉందని, 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయవచ్చని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
మహారాష్ట్రకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. పాల్ గఢ్, రాయ్ గఢ్, రత్నగిరి, గోండియా, చంద్రాపూర్, భండారా, గడ్చిరోలి, పుణె జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. వచ్చే 24 గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వానలు వస్తాయని, మరికొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వానలు కురుస్తాయని వెల్లడించారు.
కేరళ, రాజస్తాన్‌లోనూ దంచికొట్టిన వానలు
కేరళలో కూడా భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. కోజికోడ్, కొట్టాయం, కన్నూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి నుంచి శనివారం పొద్దంతా భీకరంగా వానలు కురిశాయి. చాలాచోట్ల చెట్లు నేలకూలాయి. ఇండ్లు, బండ్లకు డ్యామేజ్ జరిగింది. కరెంటు సరఫరాకు అంతరాయం కలిగింది. ఆదివారం కూడా భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అళప్పుజ, కొట్టాయం, ఇడుక్కి, ఎర్నాకుళం, త్రిస్సూర్, మలప్పురం, కోజికోడ్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
ప్రజలు తీర ప్రాంతాలు, నదుల వద్దకు వెళ్లవద్దని హెచ్చరించారు. ఇక రాజస్తాన్ లో కూడా శనివారం పలు జిల్లాల్లో భారీ వానలు కురిశాయి. దౌసా జిల్లాలో 15.8 సెంటీమీటర్ల వర్షం పడింది. అజ్మేర్, జోధ్ పూర్, జైపూర్, భరత్ పూర్ డివిజన్ లోనూ భారీ వర్షాలు పడ్డాయి. బెంగాల్ రాజధాని కోల్కతాలోనూ భారీ వర్షం కురిసింది. సిటీలోని పలు ప్రాంతాలు జలమయంగా మారాయి. దీంతో ప్రజలు, వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.
జార్ఖండ్‌లో నీట మునిగి నలుగురు మృతి
జార్ఖండ్‌లోని సరాయ్ కేలా ఖర్సావాన్ జిల్లాలో చెక్ డ్యాంలో మునిగి నలుగురు యువకులు చనిపోయారు. చెక్ డ్యాంలో స్నానం చేస్తూ ప్రమాదవశాత్తూ అందులో మునిగి చనిపోయారని పోలీసులు తెలిపారు. నలుగురి మృతదేహాలను వెలికితీశారు.