చెన్నై: ఐపీఎల్ 19లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో చెపాక్ వేదికగా జరుగుతోన్న మ్యాచులో చెన్నై బౌలర్స్ రాణించారు. పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన ముంబై ఇండియన్స్‌ను సొంతగడ్డపై కట్టడి చేశారు. చెన్నై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. నమన్ధీర్ (57) హాఫ్ సెంచరీతో రాణించగా.. ఓపెనర్ రికెల్టన్ (37) ఫర్వాలేదనిపించాడు. చెన్నై బౌలర్లలో అన్షుల్ కాంబోజ్ మూడు వికెట్లతో సత్తా చాటగా.. నూర్ అహ్మద్ రెండు, రామకృష్ణ ఘోష్, జేమీ ఓవర్టన్ చెరో చెరో వికెట్ తీశారు.
ఈ మ్యాచులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబైకి ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఇన్ఫామ్ బ్యాటర్ విల్ జాక్స్ (1)ను ఫస్ట్ ఓవర్లోనే అన్షుల్ కాంబోజ్ ఔట్ చేశాడు. ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్‌కు వచ్చిన నమన్ధీర్తో కలిసి ఓపెనర్ రికెల్టన్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ఈ క్రమంలో దూకుడుగా ఆడుతోన్న రికెల్టన్ (24 బంతుల్లో 37 పరుగులు)ను నూర్ అహ్మద్ పెవిలియన్‌కు పంపాడు. దీంతో రెండో వికెట్‌కు 58 పరుగుల పార్ట్ నర్ షిప్ ముగిసింది.
ఈ దశలో జతకట్టిన నమన్ ధీర్, సూర్య స్కోర్ బోర్డును పరిగెత్తించారు. మంచి టచ్‌లో కనిపించిన వేగంగా ఆడే క్రమంలో సూర్య కుమార్ యాదవ్ (21) వికెట్ చేజార్చుకున్నాడు. హైదరాబాదీ క్రికెటర్ తిలక్ వర్మ (5) మరోసారి విఫలమయ్యాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా నమన్ధీర్ (57) హాఫ్ సెంచరీతో ముంబైను ఆదుకున్నాడు. కెప్టెన్ పాండ్యా వేగంగా ఆడలేకపోయాడు. 23 బంతుల్లో కేవలం 18 పరుగులు మాత్రమే చేశాడు. చెన్నై బౌలర్లలో అన్షుల్ కాంబోజ్ 3 వికెట్లు పడగొట్టి ముంబై ఇండియన్స్ ను కట్టడి చేశాడు. నూర్ అహ్మద్ రెండు వికెట్లు తీయగా.. ఓవర్టన్, రామకృష్ణ చెరో వికెట్ తీశారు.
