కొడంగల్, వెలుగు: వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణంలోని బస్తీ దవాఖానాలను మున్సిపల్ చైర్పర్సన్ ప్రశాంత్, కమిషనర్ బలరాం నాయక్ కలిసి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. బాలాజీనగర్‌లోని దవాఖానాను సందర్శించగా అక్కడ కేవలం ల్యాబ్ టెక్నీషియన్ మాత్రమే ఉండటం, డాక్టర్ అమృత అందుబాటులో లేకపోవడాన్ని అధికారులు గుర్తించారు.
మరోచోట ఉన్న సదరు వైద్యురాలిని ప్రశ్నించగా ఆమె నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంపై చైర్మన్ అసహనం వ్యక్తం చేశారు. అంతేకాకుండా, గత మూడు నెలల నుంచి ఆసుపత్రిలో అటెండెన్స్ రిజిస్టర్ కూడా నిర్వహించకపోవడం అధికారులను విస్మయానికి గురిచేసింది. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న సదరు వైద్యురాలిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారికి చైర్మన్ ఫిర్యాదు చేశారు.
