నేడు(ఫిబ్రవరి 13) ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మున్సిపోల్ రిజల్ట్స్

 నేడు(ఫిబ్రవరి 13)  ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మున్సిపోల్ రిజల్ట్స్
  • ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం 
  • మధ్యాహ్నం వరకు రిజల్ట్స్​వచ్చే చాన్స్​
  • కొత్తగూడెం కార్పొరేషన్​తోపాటు ఏడు మున్సిపాలిటీల్లో ఓట్ల లెక్కింపు
  • మొదటి ఫలితం అశ్వారావుపేట మున్సిపాలిటీ నుంచే 

భద్రాద్రికొత్తగూడెం/ ఖమ్మం, వెలుగు : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలకు ఆఫీసర్లు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కొత్తగూడెం మున్సిపల్​కార్పొరేషన్​తోపాటు ఏడు మున్సిపాలిటీల్లో జరిగిన ఎన్నికలకు శుక్రవారం ఓట్లను లెక్కించనున్నారు. తొలి ఫలితం అశ్వారావుపేట మున్సిపాలిటీ నుంచి వచ్చే అవకాశాలున్నాయి. కొత్తగూడెం మున్సిపల్​కార్పొరేషన్ ఫలితాలు చివరగా రానున్నాయి. 

కౌంటింగ్​కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి..

కొత్తగూడెం మున్సిపల్​కార్పొరేషన్ ఓట్ల లెక్కింపు పాల్వంచలోని అనుబోస్​ఇంజినీరింగ్ కాలేజీలో జరగనుంది. కార్పొరేషన్​లో 60 డివిజన్లకు 60 టేబుల్స్ ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లను కలెక్టర్​ జితేశ్ వి పాటిల్, ఎస్పీ బి.రోహిత్ రాజు గురువారం పరిశీలించారు. కార్పొరేషన్​లో 1,34,775 ఓట్లకు 1,00,576 ఓట్లు నమోదయ్యాయి.  కార్పొరేషన్​లోని 27వ డివిజన్ ఫలితాలు మొదట వెలువడనుంది. ఈ డివిజన్లో 1063 ఓట్లు మాత్రమే పోల్​ అయ్యాయి. 21వ డివిజన్​ఫలితాలు చివరగా వచ్చే అవకాశాలున్నాయి. ఈ డివిజన్​లో 2296 ఓట్లు పోల్ అయ్యాయి. 

ఇల్లెందు మున్సిపాలిటీలో 24 వార్డులకు18 టేబుల్స్ ఏర్పాటు చేశారు. 24 ఏరియాలోని సింగరేణి కమ్యూనిటీ హాల్​లో ఓట్ల లెక్కింపు జరగనుంది. 33,723 ఓట్లకు 23,121ఓట్లు నమోదయ్యాయి. 
    
అశ్వారావుపేట మున్సిపాలిటీలో 22 వార్డులకు ఒకేసారి ఓట్లను లెక్కించనున్నారు. అగ్రికల్చర్​ కాలేజీలో ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు చేశారు. 16,850 మంది ఓటర్లకు12,839 ఓట్లు పోల్ అయ్యాయి. 
    
ఏదులాపురం మున్సిపాలిటీలో 31 వార్డుల్లో ఒక వార్డు ఏకగ్రీవం అయింది. 30 వార్డులకు రెండు రౌండ్లలో ఓట్లను లెక్కించనున్నారు.43,811 మంది ఓటర్లకు 37,425 ఓట్లు పోల్ అయ్యాయి.  
    
వైరా మున్సిపాలిటీలో 20 వార్డులు ఉండగా, రెండు రౌండ్లలో ఓట్లను లెక్కించనున్నారు. 24,689 ఓటర్లకు 20,668 ఓట్లు పోల్ అయ్యాయి. 
    
కల్లూరు మున్సిపాలిటీలో 20 వార్డులు ఉండగా, రెండు రౌండ్లలో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. 18,866 మంది ఓటర్లకు 16,428 ఓట్లు పోల్ అయ్యాయి.
    
 మధిర మున్సిపాలిటీలో 22 వార్డులు ఉండగా, రెండు రౌండ్లలో ఓట్లను లెక్కిస్తారు. 25,679 మంది ఓటర్లకు 20,078 ఓట్లు పోల్​ అయ్యాయి. 
    
సత్తుపల్లి మున్సిపాలిటీలో 23 వార్డులు ఉండగా, రెండు రౌండ్లలో ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు చేశారు. 28,830 ఓటర్లకు 22,434 ఓట్లు పోల్​ అయినట్లు అధికారులు వెల్లడించారు.  

గెలుపుపై ధీమా..

మున్సిపల్​ఎన్నికల నోటిఫికేషన్​ మొదలు పోలింగ్​వరకు అభ్యర్థులు ఇష్టమొచ్చినట్లు ఖర్చు చేశారు. ఉమ్మడి జిల్లాలోని కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్​తోపాటు ఆరు మున్సిపాలిటీల్లో పోలింగ్ సరళిపై ఆయా పార్టీల ముఖ్యనేతలతోపాటు అభ్యర్థులు రివ్యూ చేస్తున్నారు. గెలుపుపై ఎవరికి వారు ధీమా వ్యక్తం 
చేస్తున్నారు. 

తేలనున్న అభ్యర్థుల భవితవ్యం..

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగా ఏర్పడిన కొత్తగూడెం మున్సిపల్​కార్పొరేషన్ తోపాటు అశ్వారావుపేట, ఏదులాపురం, మధిర, వైరా, కల్లూరు, సత్తుపల్లి మున్సిపాలిటీల్లోని 223 డివిజన్లు, వార్డులకు పోటీ చేసిన 955 మంది భవితవ్యం శుక్రవారం తేలనుంది. ఎప్పుడు తెల్లవారుతుందోనని అభ్యర్థులు టెన్షన్​పడుతున్నారు.