మున్సి పల్ ఎన్నికల్లో బీసీల జనాభా ప్రకారం టికెట్లు ఇవ్వాలి : జాజుల శ్రీనివాస్ గౌడ్

మున్సి పల్ ఎన్నికల్లో బీసీల జనాభా ప్రకారం టికెట్లు ఇవ్వాలి : జాజుల శ్రీనివాస్ గౌడ్
  • నామినేషన్ వేసిన బీసీలకు బీఫామ్ లు ఇవ్వాలి: జాజుల 

హైదరాబాద్,వెలుగు: మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ వేసిన బీసీలకు బీఫామ్ లు ఇవ్వాలని అన్ని రాజకీయ పార్టీలను బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. బీసీలకు జనాభా దామాషా ప్రకారం టికెట్లు ఇవ్వాలని కోరారు. మున్సిపల్ చైర్​పర్సన్లు, మేయర్ పదవుల్లో సైతం బీసీలకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలన్నారు.  శనివారం ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కాలేజీ వద్ద బీసీ సామాజిక వేదిక రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కాంపాటి రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి జాజుల శ్రీనివాస్ గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరై, మాట్లాడారు. 

ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ , బీఆర్ఎస్ పార్టీలు జనాభా దామాషా ప్రకారం టికెట్లు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. జనరల్ స్థానాల్లో ఇప్పటికే నామినేషన్ వేసిన బీసీలకు బీఫామ్ లు ఇవ్వాలని సూచించారు. జనరల్ స్థానాలు అంటే రెడ్డి, రావులవి మాత్రమే కావని జనరల్ స్థానాల్లో బీసీలకు అవకాశం కల్పిస్తేనే జనాభా దామాషా ప్రకారం రాజకీయ వాటా దక్కుతుందని తెలిపారు.  

బీసీలను రాజకీయంగా అణచివేయడానికి అగ్రకుల రాజకీయ పార్టీలు సర్వేల పేరుతో బీఫామ్ లు ఇవ్వకుండా కుట్ర చేస్తున్నాయని,  బీసీలకు టికెట్లు ఇవ్వడానికి నిరాకరిస్తే ఊరుకోమని హెచ్చరించారు. బీసీలకు జనాభా దామాషా ప్రకారం రాజకీయ వాటా కల్పిస్తామని ప్రధాన రాజకీయ పార్టీలు ప్రకటించాలని జాజుల రిక్వెస్ట్ చేశారు. కార్యక్రమంలో ఓయూ ప్రొఫెసర్లు కొండా నాగేశ్వర్, చలమల్ల వెంకటేశ్వర్లు, డాక్టర్ పరంధాములు, నిజ్జన రమేశ్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.