మెజార్టీ వార్డుల్లో పోటాపోటీ.. ఉమ్మడి జిల్లాలో 409 వార్డులు.. 1,486 మంది అభ్యర్థులు

మెజార్టీ వార్డుల్లో పోటాపోటీ.. ఉమ్మడి జిల్లాలో 409 వార్డులు.. 1,486 మంది అభ్యర్థులు
  • ముగిసిన విత్​డ్రాలు.. ఫైనల్​ లిస్టులు విడుదల
  • కాంగ్రెస్, బీఆర్ఎస్​లకు తప్పని రెబల్స్​ బెడద
  • బీఫాంలు ఇవ్వని క్యాండిడేట్ల నిరసనలు

మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, వెలుగు: నామినేషన్ల ఉప సంహరణ ముగియడంతో మున్సిపల్ ఎన్నికల్లో వార్డుల్లో పోటీపై క్లారిటీ వచ్చింది. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 19 మున్సిపాలిటీల్లో 409 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. పోటా పోటీగా నామినేషన్లు దాఖలు కాగా ఉప సంహరణలు పూర్తయ్యాక 1,486 మంది అభ్యర్థులు బరిలో మిగిలారు. సంగారెడ్డి జిల్లాలోని 11 మున్సిపాలిటీల్లో 256 వార్డుల్లో 869 మంది, మెదక్ జిల్లాలోని 4 మున్సిపాల్టీల్లో 74 వార్డుల్లో 288 మంది, సిద్దిపేట జిల్లాలోని 4 మున్సిపాలిటీల్లో 79 వార్డుల్లో 329 మంది అభ్యర్థులు పోటీలో మిగిలారు.

మెజారిటీ వార్డుల్లో కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ పార్టీ అభ్యర్థులు పోటీదారులుగా ఉండగా పలు వార్డుల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు రెబెల్స్ బెడద నెలకొంది. ఆయా పార్టీల టికెట్ ఆశించి భంగపడిన వారిలో కొందరు బీఎస్పీ పార్టీ అభ్యర్థులుగా, మరికొందరు ఇండిపెండెంట్లుగా బరిలో ఉన్నారు.

సంగారెడ్డి జిల్లాలో.. 

జిల్లాలోని 11 మున్సిపాలిటీల పరిధిలో 256 వార్డుల్లో 869 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. నామినేషన్ల ఉపసంహరణ, బీఫామ్ ల సబ్మిషన్ పూర్తి కావడంతో ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ ను అధికారులు ప్రకటించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు రెబల్స్ బెడద ఉండగా, అన్ని మున్సిపాలిటీల్లో బహుముఖ పోటీ నెలకొంది. సంగారెడ్డి మున్సిపాలిటీలో 38 వార్డుల్లో 176 మంది అభ్యర్థులు బరిలో నిలవగా, సదాశివపేట 26 వార్డుల్లో 99 మంది, జహీరాబాద్ 37 వార్డుల్లో 174 మంది, కోహిర్ 16 వార్డుల్లో 59 మంది, నారాయణఖేడ్ లో 15 వార్డుల్లో 57 మంది బరిలో నిలిచారు.

అందోల్-జోగిపేట బల్దియాలో 20 వార్డుల్లో 63 మంది, ఇస్నాపూర్ లో 26 వార్డుల్లో 101 మంది, ఇంద్రేశంలో 18 వార్డుల్లో 76 మంది, జిన్నారం మున్సిపాలిటీలో 20 వార్డుల్లో 54 మంది, గడ్డపోతారంలో 18 వార్డుల్లో 72 మంది, గుమ్మడిదల మున్సిపాలిటీలో 22 వార్డుల్లో 94 మంది బరిలో నిలిచారు.

సిద్దిపేట జిల్లాలో..

జిల్లాలోని చేర్యాల, హుస్నాబాద్, గజ్వేల్, దుబ్బాక మున్సిపాలిటీల్లోని 72 వార్డులకు మొత్తం 129 మంది నామినేషన్లను విత్ డ్రా చేసుకోగా 329 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఎన్నికల్లో పోటీ పడుతున్న అభ్యర్థుల జాబితాలను ఆయా రాజకీయ పార్టీల నాయకులు విడుదల చేసి అభ్యర్థులకు బీ ఫామ్ లను అందజేశారు. చేర్యాల మున్సిపాలిటీలో మొత్తం 12 వార్డులకు 44, హుస్నాబాద్ మున్సిపాలిటీలో 20 వార్డులకు  92, దుబ్బాక మున్సిపాలిటీలో 20 వార్డులకు105, గజ్వేల్ మున్సిపాలిటీలో 20 వార్డులకు  88 మంది బరిలో నిలిచారు. అభ్యర్థుల తుది జాబితాలను విడుదల చేసిన అధికారులు ఇండిపెండెంట్ల అభ్యర్థులకు గుర్తులను కేటాయిస్తున్నారు.

 మెదక్​ జిల్లాలో..

మెదక్  మున్సిపాలిటీలో 32 వార్డులు ఉండగా స్క్రూటినీ తర్వాత 150 అభ్యర్థులు మిగిలారు. వారిలో 37 మంది అభ్యర్థులు విత్​ డ్రా చేసుకోగా 112 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. బీఆర్​ఎస్​ 31, కాంగ్రెస్​ 31,  బీజేపీ 27 వార్డుల్లో పోటీ చేస్తున్నారు. ఎంఐఎం అభ్యర్థులు 5 వార్డుల్లో, ఇండిపెండెంట్లు 12 వార్డుల్లో పోటీలో ఉన్నారు. అత్యధికంగా 27వ వార్డులో ఏడుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. 6వ వార్డులో కాంగ్రెస్​ టికెట్​ ఆశించి భంగపడ్డ లాలు బీఎస్పీ అభ్యర్థిగా బరిలో నిలవగా, 30వ వార్డులో కాంగ్రెస్​టికెట్​ఆశించిన అఫ్జల్​ టికెట్​రాకపోవడంతో ఇండిపెండెంట్​గా పోటీలో నిలిచారు.

తూప్రాన్ మున్సిపాలిటీలో 16 వార్డులు ఉండగా విత్​ డ్రా అనంతరం మొత్తం 64 మంది అభ్యర్థులు బరిలో మిగిలారు. కాంగ్రెస్​ 16, బీఆర్ఎస్​16, బీజేపీ 16 స్థానాల్లో అభ్యర్థులను నిలపగా, బీఎస్పీ ఒక స్థానం, ఏఐఎఫ్​బీ 4 స్థానాల్లో, ఇండిపెండెంట్లు 10 స్థానాల్లో, ఇతర రిజిస్టర్డ్​ పార్టీ ఒక స్థానంలో పోటీ చేస్తున్నాయి. నర్సాపూర్ మున్సిపాలిటీలో 15 వార్డులకు 99 నామినేషన్లు దాఖలు కాగా 36 మంది తమ నామినేషన్లను విత్​డ్రా చేసుకోగా 63 మంది బరిలో మిగిలారు. అత్యధికంగా13వ వార్డులో ఏడుగురు, 4వ వార్డులో ఆరుగురు బరిలో ఉన్నారు. రామాయంపేట మున్సిపాలిటీలో 12 వార్డులకు 48 మంది బరిలో మిగిలారు. కాంగ్రెస్​12, బీఆర్ఎస్12, బీజేపీ 12 స్థానాల్లో పోటీ చేస్తుండగా ఇండిపెండెంట్లు 11 స్థానాల్లో, జెఎస్ పీ ఒక స్థానంలో పోటీ చేస్తున్నాయి. అత్యధికంగా 9, 11 వార్డుల్లో ఏడుగురు అభ్యర్థుల చొప్పున బరిలో ఉన్నారు.

మరోవైపు రెబల్స్ నిరసనలు..

సంగారెడ్డి జిల్లాలోని జిన్నారం, జహీరాబాద్ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్గాలు నిరసన తెలిపాయి. టికెట్లు ఆశించి భంగపడ్డ అభ్యర్థులు సొంత పార్టీ తీరును బహిరంగంగా విమర్శించారు. జిన్నారం మున్సిపాలిటీలో కాంగ్రెస్ మహిళా నాయకురాలు నీలం శ్రీలత తనకు బీఫామ్ ఇవ్వలేదని ఎంపీడీవో ఆఫీసు ఎదుట రోడ్డుపై బైఠాయించి స్థానిక నాయకులపై విమర్శలు చేశారు. నాలుగో వార్డు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీకి అనుమతి ఇచ్చినట్టే ఇచ్చి చివరి క్షణంలో బీఫామ్ ఇవ్వలేదని శాపనార్ధాలు పెడుతూ దుమ్మెత్తి పోశారు.

బీఫామ్ అమ్ముకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించేందుకు తాను పనిచేస్తానని శపథం చేశారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ హనుమంతు అక్కడికి చేరుకొని బాధితురాలికి నచ్చజెప్పి పంపించారు. జహీరాబాద్ మున్సిపాలిటీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఆశావాహులు తిరుగుబావుటా ఎగరేశారు. మున్సిపల్ ఆఫీసు వద్ద టికెట్లు రాని క్యాండిడేట్లు ఆయా పార్టీల బడ నాయకులను నిలదీశారు. బీఆర్ఎస్ టిక్కెట్ తనకు ఇవ్వలేదని 14వ వార్డు టికెట్ ఆశించిన ఆరిఫ్ గౌరీ ఎమ్మెల్యే మాణిక్ రావును నిలదీశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన జాఫర్  34వ వార్డు నుంచి బీఫామ్ ఇవ్వకపోవడంతో నిరసన వ్యక్తం చేశారు.