- మద్దతిస్తే ఖర్చులు భరిస్తామంటున్న చైర్మన్ ఆశావహులు
- కొత్త మున్సిపాలిటీల్లో హీటెక్కిన రాజకీయాలు
సంగారెడ్డి, వెలుగు: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సంగారెడ్డి జిల్లాలో ఆరు మున్సిపాలిటీలు ఈసారి తొలి సమరానికి సిద్ధమయ్యాయి. జిల్లాలో మొత్తం 11 మున్సిపాలిటీలు, 263 వార్డులకు ఎన్నికలు జరగనుండగా ఇందులో కొత్తగా ఏర్పడిన ఇస్నాపూర్, ఇంద్రేశం, జిన్నారం, గుమ్మడిదల, గడ్డపోతారం, కోహిర్ మున్సిపాలిటీల్లో మొదటిసారి ఎన్నికలు నిర్వహించనున్నారు. ఆయా బల్దియాలపై తమ పార్టీ జెండా ఎగరాలని రాజకీయ పార్టీలు వ్యూహాలు పన్నుతున్నాయి. ఈ క్రమంలోఎన్నికల బరిలో నిలిపే అభ్యర్థులపై ప్రధాన పార్టీలు ఫోకస్ పెట్టాయి.
కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో కొత్త మున్సిపాలిటీల్లో పొలిటికల్ హీట్ పెరిగింది. ఆర్థికంగా బలంగా ఉండి ఖర్చులకు వెనుకాడని అభ్యర్థులను వెతికే పనిలో పార్టీలు నిమగ్నమయ్యాయి. చైర్మన్ స్థానాలపై దృష్టి పెట్టిన ఆశావహులు తమకు మద్దతు ఇస్తే వార్డు సభ్యుల ఖర్చంత భరిస్తామని ఆఫర్లు ప్రకటిస్తున్నారు. పురపోరులో ఈ ఆరు మున్సిపాలిటీల్లో ఓటర్లు తొలిసారి తమ ప్రతినిధులను ఎన్నుకొనున్నారు.
అభ్యర్థుల ఎంపిక ఇలా..
మున్సిపల్ ఎన్నికలు ప్రధాన పార్టీలకు సవాల్ గా మారాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక కోసం కమిటీలు నియమించి రిజర్వేషన్లకు అనుగుణంగా సమన్వయంతో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నాయి. ఇప్పటికే మున్సిపాలిటీల పరిధిలో సన్నాహక సమావేశాలు పూర్తి చేసుకున్న కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఆశావహుల నుంచి అప్లికేషన్లు తీసుకోగా అభ్యర్థులను ఖరారు చేసే పనిలో నిమగ్నమయ్యాయి. అధికార కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు ప్రతీ వార్డుకు ఐదుగురు చొప్పున పోటీ పడుతున్నారు.
కొన్నిచోట్ల బీఆర్ఎస్ తరఫున పోటీ చేసేందుకు ఒకరిద్దరూ మినహా ఆశావహులు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ఇక బీజేపీ విషయానికి వస్తే పార్లమెంట్, శాసనమండలి ఎన్నికల్లో విజయం సాధించడంతో ఆ పార్టీ తరఫున పోటీ చేసేందుకు ఆశావహులు ముందుకు వస్తున్నారు. మున్సిపల్ ఎన్నికలపై బీజేపీ ప్రధానంగా దృష్టి పెట్టడంతో యువత ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.
మద్దతిస్తే ఖర్చులు భరిస్తాం..
కోహిర్ మున్సిపాలిటీ మినహా మిగతా 5 మున్సిపాలిటీలు పటాన్ చెరు సెగ్మెంట్లో ఉన్నాయి. పటాన్ చెరు సెగ్మెంట్ ఇండస్ట్రియల్ గా, రియల్ ఎస్టేట్ పరంగా బాగా డెవలప్ కావడంతో ఇక్కడి బల్దియా ఎన్నికలు చాలా కాస్ట్లీగా మారాయి. ఐదు మున్సిపాలిటీల పరిధిలో ప్రధానంగా ఇస్నాపూర్, జిన్నారం, ఇంద్రేశం మున్సిపల్ చైర్మన్ స్థానాలను ఆశిస్తున్న కొందరు బడా నేతలు తమకు మద్దతిస్తే వార్డు స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల ఖర్చులు భరిస్తామని ఆఫర్లు ప్రకటిస్తున్నారు.
ఇస్నాపూర్ మున్సిపాలిటీలో చైర్ పర్సన్ గా తన భార్యకు మద్దతిస్తే ఎన్నికల ఖర్చులకు రూ. 20 లక్షలు ఇస్తానని ఓ నేత మాటివ్వగా ఇదే మున్సిపాలిటీలో మరో నేత తన కూతురును చైర్ పర్సన్ చేస్తే కౌన్సిలర్ స్థానాల్లో పోటీ చేస్తున్న అందరి ఖర్చులు భరించడమే కాకుండా దగ్గరుండి గెలిపిస్తానని భరోసా ఇస్తున్నారు. జిన్నారంలో ఓ నాయకుడు తనకు చైర్మన్ గా మద్దతు ఇస్తే ఒక్కో కౌన్సిలర్ అభ్యర్థికి రూ.50 లక్షలు ఎన్నికల ఖర్చులు ఇస్తానని ఆఫర్ ఇచ్చినట్టు తెలిసింది. ఇంద్రేశం మున్సిపాలిటీలోనూ ఇదే పరిస్థితి ఏర్పడింది. ఏదేమైనా పటాన్ చెరు పరిధిలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో ఈసారి అభ్యర్థుల ఖర్చులు కోట్లల్లో ఉండనున్నాయి.
