పాల్వంచ పోలీస్ స్టేషన్ లో హైటెన్షన్..ముస్లిం మహిళను పీఎస్ కు తరలించారని ఆందోళన

పాల్వంచ పోలీస్ స్టేషన్ లో హైటెన్షన్..ముస్లిం మహిళను పీఎస్ కు తరలించారని ఆందోళన
  •      ముస్లిం మహిళను ఠాణాకు తరలించడంపై ఎమ్మెల్యే, సీపీఐ నాయకుల ఆగ్రహం
  •     పోలీస్​స్టేషన్​లో ఖాళీ బ్యాలెట్​బాక్స్ ఉండటంతో బైఠాయించి ఆందోళన

భద్రాద్రికొత్తగూడెం/పాల్వంచ, వెలుగు: పాల్వంచ పోలీస్​స్టేషన్ లో బుధవారం రాత్రి హైటెన్షన్ నెలకొంది. పోలింగ్​బూత్​నంబర్​45లో దొంగ ఓటు వేశారంటూ అన్యాయంగా ఓ ముస్లిం మహిళను ఠాణాలో నిర్బంధించారని  కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కే.సాబీర్​పాషా ఆరోపించారు. ఠాణాలో ఖాళీ బ్యాలెట్ బాక్స్ కనిపించడంతో నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆందోళన చేపట్టారు. పోలీసుల తీరుపై మండిపడ్డారు. ముస్లిం మహిళను పోలీస్​స్టేషన్​కు తీసుకెళ్లడంపై తాను సీఐకి ఫోన్​చేస్తే దురుసుగా మాట్లాడారని సాబీర్ పాషా అన్నారు. సీఐ క్షమాపణ చెప్పాలని డిమాండ్​చేశారు. ఠాణాలో ఉన్న ఖాళీ బ్యాలెట్​బాక్స్​ను పోలింగ్ ఆఫీసర్లు తీసుకెళ్తుండగా.. పోలీసులే దొంగ ఓట్లు వేయిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖాళీ బ్యాలెట్ బాక్స్ ఇక్కడికి ఎలా వచ్చిందని ఎమ్మెల్యే ప్రశ్నించారు.  

రామవరంలో కాంగ్రెస్​, సీపీఐ నేతల తోపులాట

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: కొత్తగూడెం మున్సిపల్​ కార్పొరేషన్​లోని రామవరంలో కాంగ్రెస్, సీపీఐ నాయకుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. పోలీసులు వచ్చి ఇరువర్గాలను చెదరగొట్టారు. డీఎస్పీ ఆదినారాయణ బందోబస్తును పర్యవేక్షించారు.