బీఆర్ఎస్ నేత శ్రీధర్​రెడ్డి హత్య : హర్షవర్ధన్ రెడ్డి

బీఆర్ఎస్ నేత శ్రీధర్​రెడ్డి హత్య  :  హర్షవర్ధన్ రెడ్డి
  •  వనపర్తి జిల్లా చిన్నంబావి మండలంలో దారుణం
  • మంత్రి జూపల్లిదే బాధ్యత అన్న మాజీ మంత్రి కేటీఆర్​
  • ఇది ముమ్మాటికీ రాజకీయ హత్యే 

చిన్నంబావి/వనపర్తి, వెలుగు : వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం లక్ష్మీపల్లిలో బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్​రెడ్డి అనుచరుడు బొడ్డు శ్రీధర్ రెడ్డి(49)ని బుధవారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. బుధవారం రాత్రి ఇంటి పక్కనున్న కల్లం దొడ్డి స్థలంలో శ్రీధర్‌‌రెడ్డి మంచంపై నిద్రపోయాడు. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు మారణాయుధాలతో దాడి చేసి హత్య చేశారు.

 ఉదయం కుటుంబసభ్యులు దొడ్డి వైపు వెళ్లగా శ్రీధర్‌‌రెడ్డి చనిపోయి కనిపించాడు. వనపర్తి డీఎస్పీ వెంకటేశ్వర్ రావు, సీఐ నాగభూషణరావు హత్యాస్థలానికి వచ్చి పరిశీలించారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్‌తో గాలింపు చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పి.రమేశ్‌ తెలిపారు. పోస్ట్ మార్టం కోసం మృతదేహాన్ని వనపర్తి జిల్లా దవాఖానకు తరలించారు. 

గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శ్రీధర్‌‌రెడ్డి డెడ్‌బాడీతో బీఆర్ఎస్ లీడర్లు ఆందోళన చేశారు. ప్రభుత్వానికి, మంత్రి జూపల్లికి వ్యతిరేకంగా నినదించారు.  

నిష్పక్షపాత ఎంక్వయిరీ జరపాలి : కేటీఆర్​

శ్రీధర్​రెడ్డి హత్యకు మంత్రి జూపల్లి కృష్ణారావే బాధ్యత వహించాలని బీఆర్ఎస్ ​వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ డిమాండ్​ చేశారు. శ్రీధర్​రెడ్డి కుటుంబాన్ని పరామర్శించేందుకు గురువారం లక్ష్మీపల్లికి వచ్చిన ఆయన మాట్లాడుతూ కొల్లాపూర్​లో ఫ్యాక్షన్​ సంస్కృతిని తీసుకుచ్చారన్నారు. మంత్రి ప్రోద్బలం, ప్రమేయం లేకుండా ఆయన అనుచరులు ఇంతటి దారుణానికి ఒడిగట్టరని అన్నారు. 

మంత్రి జూపల్లిని బర్తరఫ్​ చేసి, ఇక్కడి ఎస్సైని సస్పెండ్ ​చేయాలని డిమాండ్ ​చేశారు.  ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే హత్యపై స్పెషల్ ​ఎంక్వైరీ చేయించాలని, వరుస హత్యలపై జ్యుడీషియల్​విచారణ జరిపించి చిత్తశుద్ధిని చాటుకోవాలన్నారు. పది రోజుల కింద తమ పార్టీ లీడర్లు డీజీపీని కలిసి క్యాంపులు పెట్టాలని, అవసరమైతే కల్లోలిత ప్రాంతంగా ప్రకటించాలని  వినతిపత్రాలు ఇచ్చారని, అయినా పట్టించుకోలేదన్నారు. 

ప్రజాపాలన పేరుతో ప్రతీకార పాలన చేస్తామంటే సీఎం రేవంత్​రెడ్డి మూర్ఖత్వమే అవుతుందని అన్నారు ఇలాంటి ఘటనలు కొనసాగితే బీఆర్ఎస్​ పెద్ద ఎత్తున ఉద్యమిస్తుందన్నారు. తమకు ఓపిక నశిస్తే జరగబోయేదానికి సీఎం, ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. పోలీసు వ్యవస్థపై తమకు నమ్మకం లేదని, ఉదయం అయిదున్నరకు ఫోన్​చేస్తే  గంటన్నర తరువాత వచ్చారన్నారు. మాజీ మంత్రి శ్రీనివాస్​గౌడ్​, బీఆర్​ఎస్​ నాయకులు ఉన్నారు.