మూసీ జాగలను కబ్జా చేస్తున్నరు : కిషన్​ రెడ్డి

మూసీ జాగలను కబ్జా చేస్తున్నరు  : కిషన్​ రెడ్డి

 

    ఆ పై పేదలకు అమ్మి వారిని నిండా ముంచుతున్నరు
    ఇందుకు మజ్లిస్​ సహకరిస్తున్నదని ఆరోపణ​

హైదరాబాద్, వెలుగు:  కొందరు ఆక్రమణదారులు మూసీ భూములను కబ్జా చేసి పేదలకు అమ్ముతున్నారని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​ రెడ్డి ఆరోపించారు. ఆ భూములు కొనుగోలు చేసిన పేదలు మోసపోతున్నారన్నారు. రిజిస్ట్రేషన్​, జీపీఏ పేరుతో మోసం చేస్తున్నారని చెప్పారు. హైదరాబాద్​ సిటీలో ఏడెనిమిదేండ్లుగా ఎక్కడ చూసినా అధికార దుర్వినియోగానికి పాల్పడి భూములను కబ్జా చేస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్​కు అందమే మూసీ నది అని, కానీ, కబ్జాదారులు, దళారీలు, రాజకీయ నాయకులు పోలీసుల సాయంతో కుమ్మక్కై మూసీ నదిని ఆక్రమించేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే ప్రత్యేక అధికారులతో ఎంక్వైరీ చేసి కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. 

బుధవారం హైదరాబాద్​లోని అంబర్​పేట, బాగ్​ అంబర్​పేట డివిజన్లలో పవర్​ బోర్లను ఆయన ప్రారంభించారు. భారత్​నగర్​లో కమ్యూనిటీ హాల్​కు శంకుస్థాపన చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రూ.3500 కోట్లతో రివర్​డెవలప్​మెంట్​ కార్పొరేషన్​ను ఏర్పాటు చేసి మూసీని ప్రక్షాళన చేస్తామని మాజీ సీఎం కేసీఆర్​ చెప్పారని, కానీ, ఒక్క అడుగూ ముందుకు పడలేదని విమర్శించారు. ప్రస్తుత సీఎం రేవంత్​ రెడ్డి.. అధికారులను, ఎమ్మెల్యే అక్బరుద్దీన్​ ఒవైసీని లండన్​ తీసుకెళ్లి థేమ్స్​ నదిలాగా మూసీని అభివృద్ధి చేస్తామంటున్నారని, కానీ, మూసీ భూముల ఆక్రమణకు సహకరించిందే మజ్లిస్​ పార్టీ అన్న విషయాన్ని రేవంత్​ మర్చిపోయారని పేర్కొన్నారు. కొన్నేండ్ల క్రితం హైదరాబాద్​కు వరదలు వచ్చినప్పుడు 111 జీవో ఎత్తేస్తామంటూ గత ప్రభుత్వం చెప్పిందని, ఆ పేరు మీద బీఆర్​ఎస్​ నాయకులు వేలాది ఎకరాలను సంపాదించారని ఆరోపించారు. కాబట్టి హైదరాబాద్​ను భవిష్యత్​లో సురక్షితంగా ఉంచాలంటే 111 జీవో రద్దుపై ప్రభుత్వం పునరాలోచించాలని సూచించారు.