సబర్మతిలాగా మూసీ డెవలప్ చేసుకుంటే తప్పేంటి? : మంత్రి పొన్నం ప్రభాకర్

సబర్మతిలాగా మూసీ డెవలప్ చేసుకుంటే తప్పేంటి? :  మంత్రి పొన్నం ప్రభాకర్
  • మూసీ నిర్వాసితులకు న్యాయం చేశాకే ప్రాజెక్టుపై ముందుకెళ్తం: పొన్నం

కరీంనగర్‌‌‌‌‌‌‌‌, వెలుగు: గుజరాత్‌‌‌‌లో సబర్మతి నదిని డెవలప్ చేసుకుంటే లేనిది.. మూసీ నదిని డెవలప్ చేస్తే తప్పేంటి అని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. మూసీ నిర్వాసితులకు న్యాయం చేసిన తర్వాతే ఈ ప్రాజెక్టుపై ముందడుగు వేస్తామని సీఎం చెప్పారని, ఎక్కడా నిర్వాసితులకు అన్యాయం జరగనివ్వమని తెలిపారు. గురువారం కరీంనగర్ క్యాంప్ ఆఫీసులో జరిగిన ఉగాది వేడుకల్లో మంత్రి పాల్గొని, అనంతరం మాట్లాడారు. 

గాంధీ పేరిట స్మృతివనం పెడ్తామంటే ఆటంకాలు కలిగిస్తున్నారని ఆరోపించారు. మూసీ ప్రాజెక్టును అప్రతిష్ట పాల్జేయాలని చూస్తున్నారని, ఎవరు అడ్డుపడినా మూసీ ప్రక్షాళన చేస్తామని, నది వెంట ఉన్న పేదలకు జీవనోపాధి కల్పిస్తామని స్పష్టం చేశారు. గాంధీజీని కాల్చి చంపిన గాడ్సే వారసులు మతతత్వవాదంతో విభజించు –పాలించు విధానాలు తెస్తున్నారని విమర్శించారు. 

కులమతాలకు అతీతంగా విద్య వైద్య రంగాలతో పాటు అనేక అంశాల్లో ఇండియా ప్రపంచ దేశాలతో పోటీ పడేలా ఉందంటే నెహ్రూ నుంచి మన్మోహన్ సింగ్ వరకు చేపట్టిన సంస్కరణలే కారణమని పేర్కొన్నారు. మోదీ 12 ఏండ్లలో మాటల గారడీ చేశారే తప్ప నిర్మాణాత్మకంగా ఒక్క పని కూడా చేయలేదని ఆరోపించారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను మోదీ అవమానించేలా మాట్లాడారని గుర్తుచేశారు.