- 23 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో..
- చెలగాటం వద్దు: ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి
హైదరాబాద్, వెలుగు: దేశంలో ఉన్నత విద్యా ప్రవేశ పరీక్షల నిర్వహణలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) పూర్తిగా విఫలమైందని, ఆ సంస్థను వెంటనే రద్దు చేయాలని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి మాజీ చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ‘జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల నిర్వహణ-కేంద్ర ప్రభుత్వ బాధ్యత’ అనే అంశంపై ఆదివారం నిర్వహించిన వెబినార్‌లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఎన్‌టీఏ పనితీరుపై 2024 నుంచి ఇప్పటివరకు 101కి పైగా సూచనలు అందాయని, అయినా 2026 పరీక్షల నిర్వహణలో ఎన్‌టీఏ ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకోలేదని విమర్శించారు.
పరీక్షల నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర లేకుండా చేయడం, విద్యను పూర్తిగా వ్యాపారీకరణ చేయడమే ప్రస్తుత సమస్యలకు కారణమని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేట్ విద్యా సంస్థలు, కోచింగ్ సెంటర్ల నిర్వాహకులకు పరీక్షా పత్రాలు ముందే ఎలా చేరుతున్నాయని ఆయన నిలదీశారు. లీకేజీల వెనుక ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.
జవాబుదారీతనం లేని పరీక్షల నిర్వహణ
ఒక్కో విద్యార్థి నుంచి రూ. 2 వేల వరకు ఫీజు వసూలు చేస్తూ, కనీసం సీసీటీవీలు కూడా లేని విద్యా సంస్థల్లో పరీక్షలు నిర్వహించడం ఏంటని లింబాద్రి ప్రశ్నించారు. పరీక్షల నిర్వహణలో ప్రభుత్వ ఉద్యోగులకు బదులు, కాంట్రాక్టు సిబ్బందిని వాడటంతోనే జవాబుదారీతనం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. 1.35 లక్షల సీట్ల కోసం 23 లక్షల మంది పోటీ పడే పరీక్షల విషయంలో ఇంత నిర్లక్ష్యం తగదని హితవు పలికారు. ప్రశ్నపత్రాల రవాణాలో అత్యున్నత భద్రత ఉండాలని, రాధాకృష్ణన్ కమిటీ సూచనలను ప్రభుత్వం అమలు చేయాలని కోరారు.
హైకోర్టు సీనియర్ న్యాయవాది జి.విద్యాసాగర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాజ్యాంగ పరిరక్షణ వేదిక నాయకులు కె. ఉమామహేశ్వరరావు, రమేశ్‌బాబు, డీఏఎస్‌వీ ప్రసాద్, డీజీ నరసింహారావు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఎన్‌టీఏ అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి, దోషులను కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా వేదిక నాయకులు డిమాండ్ చేశారు.
