
పాకిస్తాన్‌తో జరిగిన మొదటి టీ20లో బంగ్లాదేశ్ ఘన విజయం సాధించింది. పాకిస్థాన్ విధించిన 111 పరుగుల లక్ష్యాన్ని కేవలం 15.3 ఓవర్లలోనే ఛేజ్ చేసి 7 వికెట్ల తేడాతో విక్టరీ అందుకుంది. ఆదివారం (జూలై 20) మీర్పూర్‌లోని షేర్ బంగ్లా నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్ తన బౌలింగ్ తో పాకిస్థాన్ కు చుక్కలు చూపించాడు. తన నాలుగో ఓవర్ల స్పెల్ లో కేవలం 6 పరుగులే ఇచ్చి బంగ్లాదేశ్ తరపున ఆల్ టైం రికార్డ్ నెలకొల్పాడు. ఓవరాల్ గా నాలుగు ఓవర్లలో ముస్తాఫిజుర్ 6 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు.
తన మొదటి ఓవర్లో ఒకటే పరుగు ఇచ్చి హసన్ నవాజ్ వికెట్ పడగొట్టాడు. రెండో ఓవర్లో రెండు పరుగులే ఇచ్చిన ఈ బంగ్లా పేసర్.. మూడో ఓవర్లో రెండు పరుగులిచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. నాలుగో ఓవర్లో ఒకటే పరుగు ఇచ్చాడు. ముస్తాఫిజుర్ నాలుగు ఓవర్లలో ఒక బౌండరీ కూడా ఇవ్వలేదు. కనీసం అతని బౌలింగ్ లో రెండు లేదా మూడు పరుగులు కూడా రాకపోవడం విశేషం. తన అద్భుతమైన స్పెల్ తో ఈ బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ చరిత్ర సృష్టించాడు. టీ20 క్రికెట్ లో బంగ్లాదేశ్ తరపున 1.5 ఎకానమీ రేటుతో అత్యంత పొదుపుగా బౌలింగ్ చేసిన బౌలర్ గా నిలిచాడు. 2024లో నేపాల్ పై టాంజిమ్ హసన్ సాకిబ్ నాలుగు ఓవర్లలో 7 పరుగులిచ్చిన రికార్డ్ ను ముస్తాఫిజుర్ బ్రేక్ చేశాడు.
Mustafizur Rahman, wow 🤯
— ESPNcricinfo (@ESPNcricinfo) July 20, 2025
SCORECARD ▶️ https://t.co/eQf0rAFN8H #BANvPAK pic.twitter.com/7c7nPvCHoe
ఈ మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 19.3 ఓవర్లలో 110 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్ ఫకర్ జమాన్ 44 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. తస్కిన్ అహ్మద్ మూడు వికెట్లు తీసి పాక్ పతనాన్ని శాసించాడు. 111 పరుగుల లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ 15.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 112 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్ పర్వేజ్ హుస్సేన్ ఎమోన్ 56 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఈ విజయంతో మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో బంగ్లాదేశ్ 1-0 ఆధిక్యంలో నిలిచింది.