రూ.70 లక్షల కోట్లు వచ్చాయ్! ..మ్యూచువల్ ఫండ్స్కు పెట్టుబడుల వరద

రూ.70 లక్షల కోట్లు వచ్చాయ్! ..మ్యూచువల్ ఫండ్స్కు పెట్టుబడుల వరద

న్యూఢిల్లీ: స్టాక్​ మార్కెట్లతో పోలిస్తే మ్యూచువల్​ ఫండ్స్​తో (ఎంఎఫ్) రిస్క్​తక్కువ కావడంతో వీటికి విపరీతంగా ఆదరణ పెరుగుతోంది.  ఎంఎఫ్ పరిశ్రమ అసెట్స్ అండర్​ కస్టడీ (ఏయూసీ) విలువ గత నెల రూ. 70.9 లక్షల కోట్లకు పెరిగింది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 22 శాతం ఎక్కువ.   మెట్రో నగరాలతోపాటు ఇతర ప్రాంతాల జనం కూడా ఎంఎఫ్​లలో పెద్ద ఎత్తున డబ్బు పెట్టుబడిగా పెడుతున్నారు.

  కరోనా తరువాత వృద్ధి మరింత వేగంగా పెరిగింది. ఏయూసీ 2017లో రూ. 19.3 లక్షల కోట్ల నుంచి 2023 నాటికి రూ. 39.3 లక్షల కోట్లకు పెరగడానికి కేవలం ఎనిమిదేళ్లే పట్టింది.  కేవలం గత రెండేళ్లలో అసెట్​ బేస్​ రూ. 71 లక్షల కోట్లకు.. అంటే రెట్టింపయింది. టాప్​–5 సిటీలు ముంబై, ఢిల్లీ, బెంగళూరు, కోల్​కతా, పుణే ఆస్తుల వాటా 2016లో 73 శాతం ఉండగా, 2025 నాటికి అది 53 శాతానికి తగ్గింది.  ఇతర నగరాల వాటా 3 శాతం నుంచి దాదాపు 19 శాతానికి పెరిగింది.  టైర్-–2,3 నగరాల్లో ఎంఎఫ్​లు చొచ్చుకుపోతున్నాయి. హైదరాబాద్​, సూరత్​, లక్నో, జైపూర్​, నాగ్​పూర్​, వడోదర, భోపాల్ నుంచి పెట్టుబడులు పెరుగుతున్నాయి. 


చిన్న నగరాల దూకుడు 

మ్యూచువల్​ ఫండ్స్​లో సూరత్ వాటా 0.77 శాతానికి (2016లో 0.55 శాతం నుంచి) పెరిగింది. లక్నో వాటా 0.68 శాతానికి (0.50 శాతం నుంచి),  జైపూర్ వాటా 0.85 శాతానికి (0.72 శాతం నుంచి) పెరిగింది.  భోపాల్  0.35 శాతం  (0.21 శాతం నుంచి), వడోదర  0.86 శాతం (0.71 శాతం నుంచి), నాగ్​పూర్ (0.43 శాతం నుంచి 0.56 శాతానికి) వాటా కూడా పెరిగింది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం తగ్గుదల ఉంది. కొచ్చిన్ వాటా 0.24 శాతానికి (0.37 శాతం నుంచి) పడిపోగా, ఉదయ్​పూర్ వాటా 0.16 శాతానికి (0.40 శాతం నుంచి) తగ్గింది. సిస్టమాటిక్ ​ఇన్వెస్ట్​మెంట్ ​ప్లాన్స్​(సిప్) వాటా కూడా వేగంగా పెరుగుతోంది. ఈ ఏడాది సెప్టెంబర్​లో నెలవారీ సిప్​ ఇన్​ఫ్లోలు రికార్డు స్థాయిలో రూ. 29,361 కోట్లకు చేరాయి. ఇది సంవత్సరం క్రితం ఉన్న రూ. 24,509 కోట్ల నుంచి దాదాపు 20 శాతం పెరిగింది. మార్కెట్లో ఆటుపోట్లు ఉన్నా వీటి ఇన్​ఫ్లోలు తగ్గలేదు. ఈక్విటీ- లింక్డ్​ ఆస్తుల విలువ అక్టోబర్ 2024లో రూ. 42.4 లక్షల కోట్లు ఉండగా, అక్టోబర్ 2025 నాటికి రూ. 50.9 లక్షల కోట్లకు పెరిగింది.  ఇదే కాలంలో మొత్తం మ్యూచువల్ ఫండ్ ఆస్తుల (అన్ని కేటగిరీలు) విలువ రూ. 12.9 లక్షల కోట్లు పెరిగింది.